ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్ ఈ నెల 22న కాకినాడలోని జిల్లా టిడిపి కార్యాలయంలో మినీ మహానాడును నిర్వస్తున్నామని టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు. గురువారం కాకినాడలోని జిల్లా టిడిపి కార్యాలయంలో ఆయన విలేకరులతో సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ శతవసంతాల సందర్భంగా ఆయా జిల్లాల్లో నిర్వహించిన ఈ మినీ మహానాడులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ఈ నెల 27, 28 తేదీల్లో రాజమండ్రిలో భారీ ఎత్తున మహానాడుని నిర్వహిస్తున్నామని 27న లక్ష మందికి, 28న రెండు లక్షల మందికి భోజన వసతిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. యువగళం వంద రోజులు పూర్తి చేసుకుందని ఈ యాత్రలో తమ యువనేత లోకేష్ 1250 కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్లు చెప్పారు. ఈ పాదయాత్రలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను లేవనెత్తి ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషిస్తున్నారన్నారు. రైతులు తడిసిన ధాన్యాన్ని మండుటెండలో ఎండ పెడుతుంటే వైసిపి ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. రైతు పండించిన ధాన్యం ఆర్‌బిఐ కేంద్రాల విధానాలు అమలు కావడం లేదని వారు ఏ రైస్ మిల్లుకు ధాన్యం తీసుకువెళ్లాలో చెప్తున్నారని అక్కడికి వెళ్లిన తర్వాత తేమ, తడి, మొలకలు వచ్చాయంటూ లారీకి సుమారు రూ.20 వేల నష్టం వచ్చేలా విధానాలు రూపొందించడంతో రైతులు ఆ ధాన్యాన్ని తిరిగి తెచ్చేందుకు అదనపు భారం అవుతుందని గ్రహించి వారు చెప్పిన ధరకే ధాన్యమును అమ్ముతున్నారన్నారు.ఈ సమావేశంలో టిడిపి నాయకులు ఎండీ జిలానీ, కోర్పు సాయి తేజ, బుర్రి సత్యనారాయణ, తూము కుమార్, చప్పిడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










