May 19,2023 19:37

ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న లింగన్న

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించుకోవడానికి 22న కలెక్టరేట్‌ ముందు ధర్నాను చేపడుతున్నట్లు వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు కె.లింగన్న, మండల అధ్యక్షులు రంగనాథ్‌ తెలిపారు. శుక్రవారం మండలంలోని పాండవగల్లు, కొత్తూరు గ్రామాల్లో ఉపాధి హామీ పనుల దగ్గరికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెండు పూటల పని విధానాన్ని ఎత్తివేయాలని, ఆన్‌లైన్‌ మస్టర్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఉపాధి కొలతల రేట్లు పెంచాలని, సమ్మర్‌ అలవెన్స్‌ 50 శాతం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పనుల దగ్గర నీరు, నీడ, మెడికల్‌ కిట్లు, గడ్డపార సాన పెట్టుకోవడానికి వేతనం కొనసాగించాలని కోరారు. ఉపాధి పనులకు వెళ్లే ప్రతి కూలీకీ పనిముట్లు అందజేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి కూలీల సమస్యల పరిష్కారానికి 22న కలెక్టరేట్‌ ముందు జరిగే ధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.