May 20,2023 19:34

ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న అంజిబాబు

ప్రజాశక్తి - మంత్రాలయం
ఉపాధి కూలీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 22న నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్‌డి.అంజిబాబు కోరారు. శనివారం మంత్రాలయంలో ఉపాధి కూలీలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి కూలీలకు కేటాయిస్తున్న బడ్జెట్‌ను తగ్గిస్తూ వస్తున్నారని విమర్శించారు. ఆన్‌లైన్‌ అటెండెన్స్‌ ఎత్తివేయాలని కోరారు. పని దినాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయని, వేసవిలో ఇస్తున్న సమ్మర్‌ అలవెన్స్‌ను కూడా ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. ఉపాధి హామీ చట్టం కూలీల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌ దగ్గర జరుగు ధర్నాలో ఉపాధి కూలీలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. మండల నాయకులు జయరాజు, ప్రాణేష్‌, లక్ష్మన్న పాల్గొన్నారు.
ఆదోనిరూరల్‌ : ఉపాధి హామీ చట్టం కూలీల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె.వెంకటేశులు, వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు కె.లింగన్న, రైతు సంఘం మండల నాయకులు బాష విమర్శించారు. శనివారం మండలంలోని పెద్దతుంబలం, కుప్పగల్లు, హానవాళ్‌, జి.హోసళ్లి గ్రామాల్లో ఉపాధి పని ప్రదేశాల్లోకి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ చట్టంలో అనేక మార్పులు తీసుకొచ్చి నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతోందని విమర్శించారు. ఈ కుట్రలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత ఉపాధి కూలీలపై ఉందని తెలిపారు. 2022-23 సంవత్సరంలో ఉపాధి హామీ చట్టానికి రూ.89 వేల కోట్లు ఖర్చు కాగా, ఈఏడాది కేవలం రూ.60 వేల కోట్లు కేటాయించి ఉపాధి హామీ చట్టానికి కోత పెట్టిందని విమర్శించారు. పని దినాలు తగ్గించాలని దురుద్దేశంతోనే బిజెపి ప్రభుత్వం నిధులు తగ్గించిందని మండిపడ్డారు. రెండు పూటల పని, ఆన్‌లైన్‌ మస్టర్‌ విధానం వల్ల కూలీలకు నష్టం జరుగుతోందని తెలిపారు. సమ్మర్‌ అలవెన్స్‌ 40 శాతం ఇవ్వాలని, గడ్డపార సాన పెట్టుకోవడానికి రూ.50, నీరు, నీడ, మెడికల్‌ కిట్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈనెల 22న కలెక్టరేట్‌ ముందు ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ధర్నాకు వ్యకాస అఖిల భారత నాయకులు బీవీ.రాఘవులు హాజరవుతున్నారని తెలిపారు. వ్యకాస నాయకులు చిన్న బుడ్డి వెంకటేష్‌, అబ్దుల్‌ రహీం పాల్గొన్నారు. పెద్దకడబూరులో వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు ఈడిగ తిక్కన్న, సిఐటియు నాయకులు దేవదాసు ఉపాధి పనులను పరిశీలించారు. కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కోసిగి (రూరల్‌) మండలంలోని కోల్‌మాన్‌పేట గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను ప్రజాసంఘాల నాయకులు రాముడు, వీరేష్‌ పరిశీలించి, ఉపాధి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.