క్రయవిక్రయాలకు ఆస్కారం లేని వేలాది ఎకరాలు
అత్యవసర పరిస్థితుల్లో భూయజమానుల అవస్థలు
ఏళ్ల తరబడి పట్టించుకోని అధికారులు, నేతలు
ప్రజాశక్తి -కోటవురట్ల : మండల వ్యాప్తంగా కొన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న '22ఎ' భూములతో ప్రజలు నానాఅవస్థలు పడుతున్నా అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2016 తర్వాత '22ఎ' పరిధిలోకి మండల వ్యాప్తంగా వేలాది ఎకరాలు భూములు వెళ్లిపోవడంతో, అవి క్రయవిక్రయాలు జరగక భూయజమానులు, హక్కుదారులు అవస్థలు పడుతున్నారు. ఎస్‌సి, ఎస్‌టి బలహీన వర్గాలకు సంబంధించిన కేటాయించిన భూములు సహా దేవాదాయ, ఇనాం, వక్ఫ్, ప్రభుత్వ, పోరంబోకు భూములు సైతం '22ఎ'లో చేర్చడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఎంతటి అత్యవసర పరిస్థితి వచ్చినా వాటిని భూ యజమాని అమ్ముకునే హక్కు లేకపోవడం, కొనేవారు సైతం ముందుకు రాకపోవడంతో ఈ సమస్య ఏళ్లతరబడి ప్రహాసనంగానే సాగుతోంది.
మండల వ్యాప్తంగా 20 రెవెన్యూ గ్రామాల పరిధిలోని25 గ్రామపంచాయతీల గ్రామాల్లో '22ఏ' భూములు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు తెలుపుతున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, అనారోగ్య సమస్యలు, ఇతరత్రా అత్యవసర పరిస్థితుల్లో ఈ భూములను అమ్ముకునే హక్కు భూయజమానికి లేకుండా పోయింది. 40,483.80 ఎకరాల విస్తీర్ణం కలిగిన మండలంలో పట్టా భూమి 28,588.80 ఎకరాలుండగా, వాటిల్లో ప్రభుత్వ భూమి 8081.93 ఎకరాలు, అటవీ భూమి
3012.66 ఎకరాలు
ఉంది. ఇందులో గ్రామాల వారీగా చూస్తే 22ఎ భూములు వివరాలు ఎకరాల్లో విస్తీర్ణం ఇలా ఉంది. అన్నవరంలో 312.21 ఎకరాలు, బికేపల్లిలో 851.21, బోడపాలెంలో 464.28, చిన్న బొడ్డేపల్లిలో 227.03, చౌడువాడలో 189.22, గొట్టువాడలో 550 13, జల్లూరులో 343.28, కైలాసపట్నంలో 11 28.58, కొడవటిపూడిలో 448.80, కోటవురట్లలో 807.92, రంగాపురంలో 654.29, పాములవాకలో 291.58, పిరామన్నపాలెంలో 37.32, పొందూరులో 38 99.51, పీకే పల్లిలో 13 16.43, రాజుపేటలో 213.15, సుఖపూరులో 105.47, టీ జగ్గంపేటలో 11 94.02, తంగేడులో 339.52, ఎండపల్లిలో 275. 38 ఎకరాలు కలుపుకుని మండల వ్యాప్తంగా 14,650 ఎకరాల భూమి 22ఏలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు అంటున్నారు. వీటిల్లో పధానంగా చిన్న సన్నకారు రైతులు కూడా ఉండగా కొన్ని గ్రామాల్లో ఆయా భూముల్లో సొంతంగా ఇల్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్న వాళ్ళు ఉన్నారు. దీనిపై తహశీల్దార్ జానకమ్మను వివరణ కోరగా, 22ఎ పరిధిలో ఉన్న భూముల సమస్యకు సంబంధించి విధానపరమైన మార్గదర్శకాలు అనుసరించి సంబంధిత అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామన్నారు. వారి సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.










