ప్రజాశక్తి అనంతపురం కలెక్టరేట్ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఈనెల 22వ తేదీ నుంచి నవంబర్ 9వ తేదీ వరకూ సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా గర్జన భేరి కార్యక్రమం నిర్వహించనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్ తెలిపారు. శుక్రవారం గణేనాయక్ భవన్‌లో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.శ్రీనివాసులు అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం, పారిశ్రామిక, సేవారంగాల్లో జిల్లా తీవ్రంగా వెనుకబడిందన్నారు. ఇక అభివృద్ధి కొలమానాలన్నింటిలో అట్టడగున ఉందన్నారు. సాగు పది సంవత్సరాలుగా గణనీయంగా తగ్గిపోతోందన్నారు. 2, 31,151 లక్షల హెక్టార్లలో సాగు కావాల్సిన వేరుశనగ 1, 22,130 లక్షల హెక్టార్లే సాగవుతోందన్నారు. వరి పంట 17,440 హెక్టార్లకు 6,626 హెక్టార్‌లో సాగు జరుగుతోందన్నారు. ఇతర పంటల పరిస్థితి కూడా ఇలాగే ఉందన్నారు. పొలం బీడు పెట్టుకోలేక సద్ద, జొన్న, కంది, టమోటా లాంటి పంటలు సాగు చేస్తున్నారన్నారు. రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు అవుతున్నప్పటికీ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ స్థాపించలేదన్నారు. అక్షరాస్యత పెరిగిందని చెప్పే పాలకులు వారికి ఉపాధి కల్పించాల్సిన పరిశ్రమలు స్థాపించాలనే విషయాన్ని విష్మరిస్తున్నారని తెలిపారు. గతం నుంచి రాయదుర్గంలో జీన్స్, తాడిపత్రి బీడి, బండల పరిశ్రమలు, పామిడి గార్మెట్స్ పరిశ్రమలుపెద్ద సంఖ్యలో మూతపడుతున్న పాలకుల్లో చలనం లేదన్నారు. బెంగళూరు- హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసి లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని పాలకులు చెప్పే మాటలు నీటి మీద రాతలుగా మారాయని విమర్శించారు. సేవారంగంలో నిపుణులు ఉపాధి కోసం బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్తుంటే పిల్లలు చదువుల కోసం విజయవాడ, గుంటూరులకు వెళుతున్నారని తెలిపారు. జిల్లా సమగ్రాభివృద్ధి జరగాలంటే ప్రత్యామ్నాయ విధానాలు రూపొందించి అమలు చేయాలన్నారు. ఇందుకోసం ఈనెల 22 నుంచి 27వ తేదీ వరకూ సంతకాల సేకరణ, 29న జిల్లా సమగ్రాభివృద్ధి- ప్రత్యామ్నాయ విధానాలు అనే అంశంపై అనంతపురం నగరంలో సెమినార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబర్ 1, 2 తేదీల్లో తాడిపత్రి, గుత్తి, అనంతపురం, రాప్తాడు నియోజకవర్గాల్లో బస్సుయాత్ర, నవంబర్ 6 నుంచి 9వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా స్కూటర్ యాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా ప్రజలు, మేథావులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఓ.నల్లప్ప, ఎం.బాలరంగయ్య, వి.సావిత్రి, జిల్లా కమిటీ సభ్యులు ఎస్.నాగేంద్ర, ఆర్‌వి.నాయుడు, రామాంజినేయులు, ఎం.నాగమణి, చంద్రశేఖర్‌రెడ్డి, క్రిష్ణమూర్తి, ముస్కిన్, వెంకటనారాయణ, అచ్యుత్, భాస్కర్, జగన్, నిర్మల, సూర్యచంద్రయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ వి.రాంభూపాల్










