
ప్రజాశక్తి-కె.కోటపాడు
తమిళనాడు రాష్ట్రానికి అక్రమంగా గంజాయి తరలిస్తుండగా, మండలంలోని ఆనందపురం జంక్షన్‌లో పోలీసులు పట్టుకున్నారు. కె.కోటపాడు పోలీసు స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను సిఐ ఎస్.తాతారావు వెల్లడించారు సిఐ కథనం ప్రకారం.... విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం ఉదయం ఆనందపురం జంక్షన్‌లో ఎ.కోడూరు ఎస్‌ఐ బి.రామకృష్ణ వాహనాలను తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో ఒక వ్యక్తి పోలీసులను చూసి పారిపోతుండగా, అనుమానంతో ఎస్‌ఐ రామకృష్ణ తన సిబ్బందితో ఆ వ్యక్తిని వెంబడించి పట్టుకున్నారు. ఆయన వద్ద ఉన్న 22 కేజీల గంజాయిని, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. నిందితుడు తమిళనాడు రాష్ట్రం మదురైకు చెందిన రాజేష్ కన్నన్ సౌందర్య పండిను అరెస్టు చేసి చోడవరం కోర్టులో హాజరు పర్చగా, కోర్టు రిమాండ్ విధించింది. దీంతో నిందితుడిని విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ సమావేశంలో ఎ.కోడూరు ఎస్‌ఐ రామకృష్ణ పాల్గొన్నారు.