ప్రజాశక్తి-పాడేరు:ఐటీడీఏ వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారం 21వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ :కూడ రాధాకృష్ణ మాట్లాడుతూ, 21 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం స్పందించేంత వరకు ఉద్యమం ఆపేది లేదని, వెంటనే జోక్యం చేసుకొని, గిరిజన విద్యార్థుల వరస మరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల మరణాలు అరికట్టేందుకు తక్షణమే హెల్త్ అసిస్టెంట్‌లను ఆశ్రమాల్లో నియమించాలన్నారు. రెండు నెలల వ్యవధిలోనే ఆరుగురు విద్యార్థులు మరణించినా అధికారులు, ప్రభుత్వానికి చలనం లేదన్నారు. పాడేరు ఐటీడీఏ పిఓ ను తక్షణమే సరెండర్ చేయాలని డిమాండ్ చేశారు. పెదబయలు తహసీల్దార్ ఆత్మహత్యపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించాలని, బాధ్యులు ఎంతటి వారైనా కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సంఘాల ప్రతినిధులను గిరిజన విద్యా సంస్థల్లో ప్రవేశాన్ని నిరాకరిస్తూ గిరిజన సంక్షేమ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన సర్కులర్ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల వేదిక చిన్నారావు, కంబిడి లత కుమారి జీవన్, అమర్, విమల, స్వరూప పాల్గొన్నారు.










