Nov 20,2022 23:47

ఆందోళనలో పాల్గొన్న నేవల్‌ బేస్‌ నిర్వాసితులు

ప్రజాశక్తి - రాంబిల్లి : తమ సమస్యల పరిష్కారాన్నికోరుతూ నేవల్‌ బేస్‌ నిర్వాసితులు చేపడుతున్న ఆందోళన ఆదివారానికి 21వ రోజుకు చేరుకుంది. వందలాదిమంది నిర్వాసితులు ఎన్‌ఎఒబి మెయిన్‌ గేట్‌ ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. నేవీ గేట్‌లను వెంటనే తీయాలని, ఆధార్‌ కార్డు ఆధారంతో నిర్వాసితులను లోపలికి పంపించాలని, జెట్టీ నిర్మాణ పనులు వెంటనే చేపట్టి పూర్తి చేయాలని, పెండింగ్‌ ప్యాకేజీలు వెంటనే క్లియర్‌ చేయాలని, మగవాళ్లతో సమానంగా మహిళలకు ప్యాకేజీ ఇవ్వాలని, నేేవల్‌ బేస్‌లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలని కోరారు. నిర్వాసితుల సమస్యలపై తక్షణం స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎనిమిది గ్రామాలు నిర్వాసితులు, జెఎసి పెద్దలు పాల్గొన్నారు.