Nov 15,2023 21:16

ప్రజాశక్తి - తాళ్లరేవు ఈ నెల 21న 24,500 మంది మత్స్యకార కుటుంబాలకు ఒఎన్‌జిసి నష్ట పరిహారం రూ.216 కోట్లు అందించనున్నట్టు వైసిపి అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అధ్యక్షుడు, ముమ్మిడివరం ఎంఎల్‌ఎ పొన్నాడ సతీష్‌ కుమార్‌ తెలిపారు. గతంలో మూడు విడతలుగా ఒక్కొక్కరికీ రూ.46 వేలు చొప్పున మనిషికి రూ.1,38,000 అందజేశామని, ప్రస్తుతంనాలుగో విడతగా ఒక్కొక్కరికీ ఆరు నెలల నష్టపరిహారం మేరకు రూ.69 వేలు జమ చేయనున్నట్టు స్పష్టం చేశారు. నవంబర్‌ 21న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి బటన్‌ నొక్కి లబ్ధిదారులకు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా పంచాయతీ పరిధిలోని గాడిమొగ, పెదవలసల, లక్ష్మీపతిపురం, చినవలసల గ్రామాల్లో జరిగిన సభల్లో ఎంఎల్‌ఎ మాట్లాడారు. చమురు సంస్థల వల్ల మత్స్య సంపద కోల్పోవడం వల్లే ఆయా సంస్థలు నష్టపరిహారం అందిస్తున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంస్థలు వస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగిలో జరగబోయే సభలో మత్స్యకారులందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ కామాడి గోవలక్ష్మి ఎంపిపి రాయుడు సునీత గంగాధర్‌, ముమ్మిడివరం ఎఎంసి చైర్మన్‌ కుడుపూడి శివన్నారాయణ, ఉపసర్పంచ్‌ కొక్కిలిగడ్డ లోకేష్‌, అంకాడి అంజిబాబు, పోతాబత్తుల నూకరాజు, రేకాడి నరసింహమూర్తి, ఎంపిడిఒ ఎం.అనుపమ, పంచాయతీ కార్యదర్శి విజెవి.రమణ పాల్గొన్నారు.