ప్రజాశక్తి-రాజవొమ్మంగి
ఈ నెల 21న మారేడుమిల్లి యూత్ ట్రైనింగ్ సెంటర్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ సుమీత్ కుమార్ ఆదేశాల మేరకు మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నామని రంపచోడవరం ఐటిడిఎ పీఓ సూరజ్ గనోరే తెలిపారు. సోమవారం ఐటిడిఎలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పిఓ మాట్లాడుతూ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మెగా జాబ్ మేళాలో నవత రోడ్డు ట్రాన్స్‌పోర్టు, గ్రీన్ టెక్ ఇండిస్టీస్, అమర్ రాజ బేటరీస్, అపోలో ఫార్మసీ, మదర్ అండ్ ఫాదర్ నర్సింగ్ సర్వీసెస్, వరుణ్ మోటార్స్, మోహన్ స్పింటేక్ష్, సుభగృహ ప్రాజెక్ట్స్, ముత్తూట్ ఫైనాన్సు, అస్ట్రో టెక్ స్టీల్స్, బ్లూ స్టార్ క్లైమేటేక్, డి-మార్ట్, సెంట్రల్ ఫార్మసీ, రిలయన్స్ జియో, డిక్షన్ ఇండియా తదితర 15 సంస్థలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. వాటి ద్వారా 915 ఖాళీలు భర్తీ చేయటం జరుగుతుందన్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లొమా, ఇంజనీరింగ్, ఏదైనా డిగ్రీ పాసైన, 18 నుండి 30 సంవత్సరాల వయసు గల యువతీ యువకులు దీనికి అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు షషష.aజూరరసష.ఱఅ అనే వెబ్ సైట్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్‌తో పాటు ఆంధ్ర ప్రదేశ్‌లో ఏ ప్రాంతంలోనైనా పని చేయాల్సి ఉంటుందన్నారు. అర్హతలు బట్టి ఎంపికైన సంస్థ ఆధారంగా రూ.7,500 నుండి రూ. 40వేలు వరకు వేతనం లభిస్తుందని తెలిపారు. ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తమ దరఖాస్తు, విద్యార్హతల జెరాక్స్ పత్రాలు, ఆధార్, పాన్ కార్డు, పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు తీసుకుని రావాలని సూచించారు. ఇతర వివరాలకు 99888 53335, 63046 34447 నెంబర్లలో సంప్రదించవచ్చన్నారు. ఈ సందర్భంగా జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్‌ను పిఒ సూరజ్ గనోరే, రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం బన్సల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎపిఓ జనరల్, సిహెచ్.శ్రీనివాసరావు, నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి డాక్టర్ పి.రోహిణి తదితరులు పాల్గొన్నారు.










