ప్రజాశక్తి- అరకులోయ:పంచాయతీ కార్మికుల గ్రీన్ అంబాసిడర్లకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21న పాడేరు జిల్లా కలెక్టరేట్ నిర్వహించనున్న ధర్నా ను విజయవంతం చేయాలని సిఐటియు మండల కార్యదర్శి జన్ని భగత్ రామ్ తెలిపారు. దీనిలో భాగంగా వర్కర్లకు కరపత్రాలను పంపిణీ చేసిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గ్రామాల్లోని వీధులను పరిశుభ్రం చేస్తూ, ప్రజల ఆరోగ్యం పట్ల నిబద్దతతో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు.రెండేళ్లుగా బకాయి వేతనాలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. టెండర్స్ విషయంలో హైకోర్టు తీర్పును అమలు చేయాలని- 010 పద్దు ద్వారా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులకు గుర్తింపు కార్డులు, కనీస వేతనాలు, ఇపిఎఫ్, ఈఎస్‌ఐ అమలు చేయాలన్నారు.










