ప్రజాశక్తి - పార్వతీపురం : జాతీయ గిరిజన తెగల(ఎస్టీ) కమిషన్ సభ్యులు అనంత్ నాయక్ ఈ నెల 21న జిల్లాకు వస్తున్నారని జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి కె.శ్రీనివాసరావు మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 21న ఉదయం 10 గంటలకు పార్వతీపురం చేరుకుంటారని, కురుపాం మండలం రేగిడి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలను తనిఖీ చేస్తారని ఆయన చెప్పారు. రేగిడిలో మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి పార్వతీపురం చేరుకుని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శిస్తారని ఆయన అన్నారు. భోజన విరామం అనంతరం గిరిజన సంఘాల నాయకులతో కలుస్తారని, రాత్రికి బస చేస్తారని చెప్పారు. 22నదీ ఉదయం 10.30 గంటలకు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తారని శ్రీనివాసరావు తెలిపారు. అనంతరం బయలుదేరి విశాఖ వెళ్తారని చెప్పారు. సభ్యులతో కమిషన్ అధికారులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. ఈ బృందం జిల్లాలో ఇప్పటివరకు జరిగిన అభివద్ధి పనులను పరిశీలించనుంది. ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు గిరిజను లకు ఏ మేరకు అభివృద్ధికి దోహదపడ్డాయో సభ్యులు తెలుసుకోనున్నారు.
స్టాల్స్ ఏర్పాటు
గుమ్మలక్ష్మీపురం : ఈనెల 21న జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు అనంత నాయక్ జిల్లాకు వస్తున్న సందర్భంగా స్థానిక ఏకలవ్య పాఠశాల సమీపాన ప్రభుత్వ ప్రగతికి సంబంధించిన వివిధ స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్టాల్స్ పరిశీలించడానికి ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి సి.విష్ణుచరణ్ మంగళవారం స్థానిక ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన సహకార సంస్థ, ఐటిడిఎ ఇంజినీరింగ్, మండల ఎడ్యుకేషన్ తదితర స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలని ఐటిడిఎ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. కేంద్ర ఎస్టీ కమిషన్ ఈ స్టాల్స్ పరిశీలించాక ఏకలవ్య పాఠశాల పనితీరును పరిశీలిస్తారని, అనంతరం ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహిస్తారని పిఒ తెలిపారు.










