Mar 18,2023 01:01
కర్లపాలెం ప్రభుత్వ వైద్య అధికారికి వినతిపత్రం అందజేస్తున్న ఆశా వర్కర్‌ యూనియన్‌, సిఐటియు సభ్యులు

ప్రజాశక్తి-కర్లపాలెం: ఆశా వర్కర్ల పని భారాన్ని తగ్గించాలని, సంబంధంలేని పనులు చేయించరాదని, ఆశా వర్కర్ల నియామ కాలు ప్రభుత్వమే నిర్వహించాలని, అక్రమ తొలగింపులు, వేధింపులు ఆపాలని, రాజకీయ జోక్యం ఆపాలని కర్లపాలెం సిఐటియూ ప్రధాన కార్యదర్శి జంగం శామ్యూల్‌ అన్నారు. ఈ నెల 21వ తేదీన డిఎంహెచ్‌వో ఆఫీసు వద్ద జరిగే ధర్నా వినతిపత్రాన్ని శుక్రవారం కర్లపాలెం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యురాలికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో మరణించిన కుటుంబాలకు ఆశవర్కర్‌ నియామకాల్లో ప్రాధాన్యత కల్పించాలని, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌, సచివాలయ డ్యూటీలు ఆశా వర్కర్లతో చేయించరాదని, ఆశావర్కర్స్‌కు సెలవులు మంజూరు చేయాలని అన్నారు. కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని, రూ.10 లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. 104 ఉద్యోగుల కోసం ఆశ వర్కర్లతో ఎలాంటి అదనపు ఖర్చులు చేయించరాదని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు రాధిక, అమీరున్నీసా తదితరులు పాల్గొన్నారు.