Mar 17,2023 00:57
డిఎంహెచ్‌వో కార్యాలయంలో వినతిపత్రం ఇస్తున్న ఆశా వర్కర్లు

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: రాష్ట్రవ్యాప్తంగా 21వ తేదీ డిఎంహెచ్‌వో ఆఫీసుల వద్ద జరిగే ధర్నాలో ఆశా వర్కర్స్‌ పాల్గొనాలని ఏపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) పిలుపునిచ్చింది. ఈ మేరకు 21వ తేదీ ధర్నా తెలియపరుస్తూ గురువారం బాపట్ల డిఎంహెచ్‌వో కార్యాలయంలో ఏవోకు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కోశాధికారి వి వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ పని భారం తగ్గించాలని, సంబంధం లేని పనులు చేయించరాదని, ఆశా వర్కర్ల నియామకాలు ప్రభుత్వమే నిర్వహించాలని, అక్రమ తొలగింపులు, వేధింపులు, రాజకీయ జోక్యం ఆపాలని, విధి నిర్వహణలో మరణించిన కుటుంబాలకు ఆశవర్కర్‌ నియామకాల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరారు. విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌, సచివాలయ డ్యూటీలు ఆశా వర్కర్లతో చేయించరాదని, ఆశా వర్కర్స్‌కు సెలవులు మంజూరు చేయాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలి, రూ.10 లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని, రికార్డులు ప్రభుత్వమే ఇవ్వాలి, 104 ఉద్యోగుల కోసం ఆశ వర్కర్లతో ఎలాంటి అదనపు ఖర్చులు చేయించరాదని అన్నారు. ఈ ధర్నాల్లో బాపట్ల జిల్లాలో ఆశాలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు బస్వకుమారి, కోటమ్మ, సుజాత, సీఐటీయూ జిల్లా నాయకులు జె శామ్యూల్‌ పాల్గొన్నారు.