Jun 06,2023 01:42
స్వాధీనం చేసుకున్న రేషన్‌ బియ్యం

ప్రజాశక్తి-చిన్నగంజాం: అక్రమంగా తరలిస్తున్న 219 బస్తాల రేషన్‌ బియ్యాన్ని మండలంలోని సంతరావూరు వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోమవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకెళ్తే చీరాల నుంచి ఉప్పుగుండూరులోని సాయి కార్తికేయ రైస్‌ మిల్లుకు రేషన్‌ బియ్యం తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారం గుంటూరు రీజనల్‌ విజిలెన్స్‌ అధికారులకు తెలియడంతో సోమవారం వేకువ జామునే సంబంధిత అధికారులు సంతరావూరు వద్ద మాటు వేసి ఏపి 31టిఎ 2266 నంబర్‌ గల లారీని తనిఖీ చేశారు. అందులో అక్రమంగా తరలిస్తున్న 219 బస్తాల రేషన్‌ బియ్యాన్ని గుర్తించి డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారించగా చీరాలలోని రెండు రేషన్‌ షాపుల నుంచి ఈ బియ్యాన్ని సరిహద్దు ప్రకాశం జిల్లాలోని ఉప్పుగుండూరు రైస్‌ మిల్లుకు తరలిస్తున్నట్లు చెప్పారు. దీంతో మరో టీం చీరాల ప్రకాష్‌ నగర్‌లో, దండుబాట రోడ్‌లో ఉన్న రెండు దుకాణాలను పరిశీలించి నిందితులుగా వారిపై కేసు నమోదు చేశారు. ఈ తనిఖీలలో విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీహరిరావు, తహశీల్దారు కే నాగమల్లేశ్వరరావు, ఎస్‌ఐ రామచంద్రయ్య, సిబ్బంది పాల్గొన్నారు.