Oct 13,2023 21:31

మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు సుబ్బరావమ్మ, నాయకులు

ప్రజాశక్తి- బెలగాం :  రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం ఆధ్వర్యాన ప్రజా రక్షణ భేరి పేరిట ఈనెల 21నుంచి బస్సుయాత్రను ప్రారంభిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ తెలిపారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల నుంచి బస్సుయాత్రలు ప్రారంభం కానుండగా, జిల్లాలోని సీతంపేటలో బస్సుయాత్రను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రారంభిస్తారని తెలిపారు. శుక్రవారం సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ బస్సుయాత్ర గిరిజన ప్రాంతాన్ని కలుపుతూ అరుకు, పాడేరు, రంపచోడవరం, పశ్చిమగోదావరి జిల్లాల మీదుగా విజయవాడ చేరుతుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వలన ప్రజలు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఈ నష్ట నివారణ చర్యలు జరగాలంటే రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి కోసం సిపిఎం విద్యావంతులు, మేధావులు, అన్ని రంగాల ప్రజలతో సదస్సులు నిర్వహిస్తోంద న్నారు. రాష్ట్రంలో అసమాన అభివృద్ధి జరుగుతుం దని, వ్యాపారులు, రియల్‌ ఎస్టేట్‌ దారులు, పెట్టుబడిదారులు అభివృద్ధి అవుతున్నారు తప్ప ప్రజల్లో ఏ రకమైన అభివృద్ధి లేదన్నారు. ఈ విషయాలన్నీ ప్రజలకు వివరించి, రాష్ట్రానికి బిజెపి చేసిన ద్రోహాన్ని తెలియజేస్తామని తెలిపారు. రాష్ట్రానికి పత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలను నిధులు ఇవ్వకుండా రైల్వే జోన్‌ పట్టించుకోకుండా బిజెపి మోసం చేసిందన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలని రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపికి మద్దతు పలుకుతున్న వైసిపి, టిడిపి, జనసేన విధానాల్ని ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఈ బస్సు యాత్రలో ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు మాట్లాడుతూ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం సిపిఎం పోరాడుతోందన్నారు. జిల్లాలో ఏనుగులను అడవికి తరలించి ప్రజలకు రక్షణ కల్పించాలని, పూర్ణపాడు లాగేసి వంతెన పూర్తి చేయాలని, వైద్య శిబిరాలు కాదు సరిపడినంత మంది వైద్యులను నియమించాలని, జిల్లాలో మెడికల్‌ కాలేజ్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. మూత పడిన లచ్చయ్యపేట సుగర్‌ ఫ్యాక్టరీ, సాలూరు జీగిరాం జ్యూట్‌ మిల్లు తెరిపించాలని, గిరిజన ప్రాంతంలో మినీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.తిరుపతిరావు కొల్లిగంగునాయుడు, వై. మన్మధరావు పాల్గొన్నారు.