
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న జనగణన త్వరలో ప్రారంభం కానుంది. 2011 జరిగిన జనగణన తరువాత మళ్లీ ఇప్పటి వరకు జరగలేదు. 2020లో కరోనా కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. తరువాత వివిధ రకాల చట్టాలతో మైనార్టీలు, వలసదారులు ఆందోళనలతో వాయిదా పర్వం కొనసాగింది. గత రెండేళ్లుగా జనాభా లెక్కల్లో కులగణన జరగాలని ప్రధానంగా బిసి జనగణన చేయాలని వివిధ సంఘాల నుంచి డిమాండ్ వచ్చింది. రాష్ట్రంలో కూడా ఈ డిమాండ్ ప్రముఖంగా తెరపైకి రావడంతో ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది. ఈనెల 21 నుంచి కులగణన చేపట్టాలని శుక్రవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2011న జరిగిన జనభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 48.57 లక్షలుగా ఉంది. దాదాపు 13 ఏళ్ల తరువాత మళ్లీ జనాభా లెక్కలు చేపట్టనున్నారు. వీరిలో ఎస్సిలు 7.5 లక్షలు, ఎస్టిలు 2.89 లక్షలు ఉన్నట్టు అంచనావేశారు. గతంలో ఎస్సి, ఎస్టిల జనాభా నమోదు జరిగేది. ఇప్పుడు కొత్తగా బిసిల జనాభా కూడా లెక్కించాలని నిర్ణయించారు. బిసిల జనాభా 25 శాతం కాకుండా దాదాపు 30 నుంచి 35 శాతం పైన ఉంటుందని ఆయా సంఘాల నాయకులు చెబుతున్నారు. గత 13 ఏళ్ల కాలంలో ఎస్సి,ఎస్టిల జనాభా కూడా పెరిగిందనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థిక, సామాజిక, విద్యాపరమైన జీవనోపాధి, జనభాసమతుల్యత అన్న అంశాలపై గణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదరిక నిర్మూలనా పథకాలకు, మానవవనరుల అభివృద్ధికి, తారతమ్యాలు తగ్గించేందుకు, అసమానతలు రూపుమాపేందుకు కులగణన ఉపయోగపడుతుందని బిసి సంఘాలు చెబుతున్నాయి.
2017లో ప్రజా సాధికారిక సర్వే ద్వారా ప్రభుత్వం కొంత సమాచారం నమోదు చేసింది. 2020 నుంచి వివిధ దశల్లో సచివాలయ ఉద్యోగులు,వాలంటీర్లు ద్వారా ఇప్పటికే కొంత డేటాను ప్రభుత్వం సేకరించింది. తాజాగా చేపట్టనున్న కులగణనపై ఇంకా మార్గదర్శకాలు రాలేదని, త్వరలో వస్తాయని అధికారులు చెబుతున్నారు. కేవలం కుల గణననే కాదని, ఒక కుటుంబంలో ఉన్న సభ్యులకు సంబంధించిన అన్ని వివరాలను నమోదుకు 2020లో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని దీని ప్రకారం అన్ని వివరాలు సచివాలయాల సిబ్బంది ద్వారా నమోదు చేసే అవకాశంఉందని జిల్లా అధికారి ఒకరు తెలిపారు. కొత్త జిల్లాల వారీగా జనాభా వివరాలు సేకరించనున్నట్టు తెలిసింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలల్లోని వివిధ మండలాల వారీగా వివరాల సేకరణకు అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. వివరాల నమోదుకు గతంలో ఉపాధ్యాయులను ఉపయోగించే వారని ఈసారి వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల ద్వారా నమోదుకు అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు.