Sep 15,2023 20:58

ప్రజాశక్తి - భీమవరం
దళితుల ఎజెం డాయే లక్ష్యంగా ఈ నెల 21వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా దళిత రక్షణ యాత్ర చేపడుతున్నట్లు కెవిపిఎస్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శులు కె.క్రాంతిబాబు, జక్కంశెట్టి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో దళిత రక్షణ యాత్ర కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్రాంతిబాబు, సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం మనువాద, మతోన్మాద విధానాలను శరవేగంగా అమలు చేస్తోందని విమర్శించారు. ఎన్నడూ లేనంతగా దళితులపై దాడులు విపరీతంగా పెంచిందన్నారు. కుల వివక్ష, అంటరానితనం, అసమానతలతో ప్రజల మధ్య చీలికలు తెస్తున్నారని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులపై దాడులు పెరిగాయన్నారు. రాష్ట్రంలో దళితులకు కనీస రక్షణ కరువైందన్నారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకూ అన్ని జిల్లాల్లో దళితులపై దాడులు మరింతగా పెరిగాయన్నారు. దళితుల సంక్షేమ పథకాలను పూర్తిగా నిలిపివేయడం దారుణమన్నారు. దళిత రక్షణ యాత్రకు జిల్లాలోని అభ్యుదయ వాదులు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, వివిధ సంస్థలు, మేధావులు, ప్రజలందరూ సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు బత్తుల విజయకుమార్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బాతిరెడ్డి జార్జి పాల్గొన్నారు.