- సర్వేలో వాలంటీర్లను వెంట తీసుకెళ్తే చర్యలు
- ఓట్ల తొలగింపునకు డాక్యుమెంట్ల అప్‌లోడ్ తప్పనిసరి
- కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: ఇంటింటి ఓటర్ల సర్వేను ఈనెల 21వ తేదీ నాటికి పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల సర్వేపై జాయింట్ కలెక్టర్, డివిజినల్, మండల స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అథికారులు, సహాయ రిజిస్ట్రేషన్ అథికారులు, బిఎల్‌ఒలతో సోమవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటి సర్వే ప్రారంభమైన 11 రోజులు పూర్తయిందన్నారు. 21వ తేదీ నాటికి సర్వేను శతశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటరు జాబితాలో తొలగింపు, జత చేయడానికి సంబంధించి ప్రతి దరఖాస్తుకు డాక్యుమెంటేషన్ పూర్తిస్థాయిలో అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు. సంతకాల్లేకుండా ఫారాలను అప్‌లోడ్ చేయొద్దని సూచించారు. హౌస్ హౌల్డ్ సర్వేకు వాలంటీర్లను వెంట తీసుకెళ్లినట్లు బిఎల్‌ఒలపై ఫిర్యాదులు వస్తే తప్పక చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు ప్రతి వారం రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకుని, వారంలో చేపట్టిన తొలగింపు, చేర్పింపు వివరాలను వెల్లడించాలన్నారు.










