ప్రజాశక్తి-డుంబ్రిగూడ: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 20న పాడేరులో నిర్వహించే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ మండల ప్రధాన కార్యదర్శి ఎస్.కన్నయ్య, అధ్యక్షుడు పి.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి కన్నయ్య మాట్లాడుతూ, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై గత నెల 17 నుంచి 22 వరకు యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా జీపు జాతా నిర్వహించి సమస్యలను సేకరించిందన్నారు. ఆ జతా ద్వారా వచ్చిన సమస్యలపై చర్చించి పరిష్కారానికి పాడేరులోని మోదకొండమ్మ కళ్యాణ మండపంలో రాష్ట్రస్థాయి విద్యా సదస్సు నిర్వహించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. ఈ సదస్సుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులతో పాటు యూటీఎఫ్ నాయకులు 400 మంది పాల్గొం టారన్నారు. ఈ సదస్సుకు గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు, సిఆర్‌టిలు, భాష వాలంటీర్లు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు మండల కార్యదర్శి ఆనంద్, నాయకులు ఏం మోహన్, ఏం.చందర్రావు, ఎం.రామకృష్ణ, ఆర్ మల్లికార్జునరావు, కె.మేఘనాధరాజు పాల్గొన్నారు.










