Sep 11,2022 00:28

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌ నర్సింగరావు

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ : కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన 7వ పే కమిషన్‌ ఆమోదించిన ప్రకారం నేటి ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీసవేతనం నెలకు రూ.26వేలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 20న రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించనున్నట్లు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.నర్సింగరావు వెల్లడించారు. జగదాంబ సమీపంలోని సిఐటియు కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని 70 షెడ్యూల్స్‌లో 50 లక్షల మంది కార్మికులకు అతి తక్కువ జీతాలను యాజమాన్యాలు చెల్లిస్తున్నాయన్నారు. ఐదేళ్లకోసారి పెంచాల్సిన కనీసవేతనాలు 12 సంవత్సరాల నుంచి మారలేదన్నారు. ధరలు విపరీతంగా పెరగడంతో నిజ వేతనాలు పడిపోయాయన్నారు. కార్మికుల పరిస్థితి ''ధరలు ఆకాశానికి జీతాలు పాతళానికి'' అన్నచందంగా ఉందన్నారు. కనీస వేతనాలు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతన సలహా మండలిని నియమించకుండా యాజమాన్యాలకు కొమ్ముకాస్తూ కార్మికులకు తీవ్ర ద్రోహం చేస్తోందని విమర్శించారు. కనీస వేతనాలు మార్పు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ నిధులు చెల్లించనక్కరలేదన్నారు. పరిశ్రమల యాజమాన్యాలే చెల్లిస్తాయన్నారు. అతి తక్కువ వేతనాలతో యజమానులు పనిచేయించుకుంటున్నారని తెలిపారు. బిల్డింగ్‌ కార్మికుల నుంచి వసూలు చేసిన వెల్ఫ్‌ర్‌ ఫండ్‌ సెస్‌ రూ.8 వేల కోట్లును కార్మికులకు చెల్లించడం లేదన్నారు. ఈ ధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమ అవసరాలకు వాడుకుంటుందని పేర్కొన్నారు.
కాంట్రాక్టు కార్మికులకు, చిన్నపరిశ్రమల్లో పనిచేసే 30 వేల మంది కార్మికులకు ఇఎస్‌ఐ కార్డులున్నా వైద్యం అందుబాటులో లేదన్నారు. 500 పడకల కోసం షీలానగర్‌లో అప్పటి కేంద్ర కార్మిక శాఖామంత్రి బండారు దత్తత్రేయ, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు 2016లో వేసిన శంకుస్థాపన రాయి అలాగే మిగిలి ఉందన్నారు. హాస్పిటల్‌ భవనాలు నిర్మించలేదన్నారు. ఫ్రావిడెంట్‌ ఫండ్‌ అనేక పరిశ్రమల్లో అమలు కావడంలేదని తెలిపారు. పరిశ్రమల్లో తనిఖీలు లేనందువలన ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయన్నారు. కనీస వేతనాలు నెలకు రూ.26 వేలు అమలు చేసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యాన ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ మాట్లాడుతూ ఈ నెల 20న విశాఖలోని సరస్వతీ పార్కు నుంచి ప్రదర్శన ప్రారంభమై కలెక్టర్‌ ఆఫీస్‌ వరకు సాగుతుందన్నారు. అక్కడ షెడ్యూల్‌ కార్మికుల ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ధర్నాను కార్మికులంతా జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి.వెంకటరెడ్డి పాల్గొన్నారు.