ప్రజాశక్తి-పాడేరు: గిరిజన సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న పలు డిమాండ్ల సాధనకై ఈ నెల 20న నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని ఎపి ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.సురేంద్ర పిలుపునిచ్చారు. పాడేరు గిరిజన సంఘం కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ, జీవో 3ను పునరుద్ధరణ చేసి నూరు శాతం రిజర్వేషన్లు అమలుకు చట్టం చేయాలన్నారు. జిఓ 3పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రివ్వు పిటిషన్ దాఖలు చేయాలన్నారు. గిరిజన సంఘం దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్ లో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతం లో మైదానం ప్రాంతం నుండి ఉపాధ్యాయుల్ని బదిలీ చేసి గిరిజన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించారు. గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన షెడ్యూల్ ఏరియాలో ప్రత్యేక హక్కులను కాలరాస్తోందన్నారు.ప్రభుత్వం జోక్యం చేసుకుని షెడ్యూల్ ఏరియాలో జీఓ 3 ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ కొనసాగించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఎస్.ధర్మన్నపడల్, జిల్లా కోశాధికారి కె.నర్సయ్య, జిల్లా నాయకులు ఎంఎం శ్రీను, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.










