ప్రజాశక్తి -ముంచింగిపుట్టు: ఈనెల 20న పాడేరులో జరిగే గిరిజన సంక్షేమ, విద్యారంగ సమస్యలపై జరిగే రాష్ట్రస్థాయి విద్యా సదస్సు పోస్టర్‌ను మండల కేంద్రంలో యుటిఎఫ్ మండల అధ్యక్షులు ఆర్.పుండరీ అధ్యక్షతన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుండారి మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అన్ని ఐటీడీఏలలో నిర్వహించిన జీపు జాతాలో భాగంగా వచ్చిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు రాష్ట్రస్థాయి విద్యాసదస్సు నిర్వహిస్తున్నామన్నారు. అన్ని ఐటీడీఏల నుండి గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు, యుటిఎఫ్ శాఖలు సుమారు 400 మందితో భారీ ఎత్తున సదస్సు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గిరిజన విద్యారంగం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. 11 సంవత్సరాలుగా సిఆర్టి లతో బోధన చేయిస్తున్న ప్రభుత్వం వారి జీతాలు 10 నెలలకు కుదించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి.నాగేశ్వరరావు, గోపి, జిల్లా కార్యదర్శి యమ్.ధర్మారావు, కార్యవర్గ సభ్యులు దనుపతి, రఘుమణి, చిన్నయ్య, దయానిది, రాజు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.










