Nov 16,2023 23:43

నరసరావుపేటలో ఏర్పాట్లపై పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి - సత్తెనపల్లి టౌన్‌: వైసిపి నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్రను ఈనెల 22న సత్తెనపల్లిలో నిర్వహిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గురువారం తెలిపారు. ఈ మేరకు స్థానిక వైసిపి కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశమ య్యారు. సమావేశానికి సిహెచ్‌ సాంబశివరావు అధ్యక్షత వహించగా మంత్రి మాట్లాడుతూ వైసిపి పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అమలు చేసిన సంక్షేమ పథకాలపై బస్సుయాత్ర ద్వారా మరింతగా ప్రచారం చేయాలన్నారు. చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు ఒక్క ముస్లిముకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని, చంద్రబాబు, పవన్‌ బీసీ ద్రోహులని విమర్శించారు. ఎన్‌టిఆర్‌ కంటే ఆయన అల్లుడు చంద్రబాబు పెద్ద నటుడని, లేనిపోని రోగాలు ఉన్నట్లు నటిస్తున్నారని ఎద్దేవ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వై.వెంకటేశ్వరరెడ్డి, నాయకులు పి.సూరిబాబు, ఎంపిపిలు, జెడ్‌పిటిసిలు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : వైసిపి నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్ర ఈ నెల 20న నరసరావుపేటలో ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని వైసిపి కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావుశంలో ఆయన మాట్లాడుతూ బస్సు యాత్ర విజయవంతం చేసేందుకు ఇప్పటికే వైసిపి శ్రేణులతో సమాలోచన చేశామని, ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని విజయవంతం చేయాలని కోరారు. ఇతర నియోజకవర్గాల్లో చేపట్టిన యాత్రకు విశేష స్పందన లభించిందని, ఇదే క్రమంలో నరసరావుపేట మండలంలోని బసికాపురం వద్ద నుండి పట్టణంలోకి భారీ ర్యాలీ చేయాలని చెప్పారు. ఎస్‌.ఆర్‌.కె.టి కాలనీ వద్ద నుండి పల్నాడు బస్టాండ్‌ వరకు పాదయాత్ర చేస్తామన్నారు. అనంతరం ఏర్పాట్లపై పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలన చేపట్టారు. సభా ప్రాంగణం, భోజనాలు, పార్కింగ్‌ ప్రదేశాలు పరిశీలించారు. ద్విచక్ర వాహనాలు మున్సిపల్‌ హైస్కూల్‌లో, కార్లు ఎస్‌ఎస్‌ఎన్‌ కళాశాల ఎగ్జిబిషన్‌ ప్రాంగణంలో, భోజనం ఎస్‌.ఎస్‌.ఎన్‌ కళాశాల ప్రధాన గేటు వద్ద ఏర్పాటు చేశామన్నారు. యాత్రలో ఎంపీ విజయసాయిరెడ్డి సహా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక తరగతులకు చెందిన మంత్రులు, ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిపారు. నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు డాక్టర్‌ గజ్జల సుధీర్‌ భార్గవ్‌రెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.