20న గ్రూప్ 1, 2 కోచింగ్ స్క్రీనింగ్ టెస్ట్
ప్రజాశక్తి - తిరుపతి టౌన్
ఆంధ్ర ప్రదేశ్ స్టడీ సర్కిల్ చే సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, గ్రూపు 2 కోచింగ్ కోసం దరఖాస్తు చేసున్నవారికి ఈ నెల 20న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు , పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పక్కగా చేపట్టాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని జిల్లా రెవెన్యూ అధికారి కోదండరామి రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో ఎ.పి.స్టడీ సర్కిల్ సివిల్ సర్వీసెస్ , గ్రూప్ 1, 2 కోచింగ్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణపై సంబంధిత శాఖలతో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.సి.వెల్ఫేర్ అధికారి చెన్నయ్య తో కలసి సమీక్ష నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు చోట్ల నిర్వహణ వుందని తిరుపతి జిల్లా కేంద్రంగా 5 పరీక్షా కేంద్రాల్లో 2325 మంది ఈ అర్హత పరీక్ష రాయనున్నారని, పరీక్షా సమయం ఆదివారం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందని అన్నారు. రాష్ట్ర పర్యవేక్షణ అధికారిని అన్నపూర్ణమ్మ, జిల్లా పర్యవేక్షణ అధికారి ఎస్.సి.వెల్ఫేర్ అధికారి చెన్నయ్యను నియమించామన్నారు. పరీక్షా కేంద్రాల్లో గంట ముందు నుండే అనుమతి వుటుందని అభ్యర్థులు సకాలంలో చేరుకోవాలని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో హాల్ టికెట్ తో పాటు తప్పనిసరి ఫోటో ఐడి వుండాలని అన్నారు. ఈ అర్హత పరీక్ష రాయడానికి పలు జిల్లాల నుండి రానున్నారని , ఎపిఎస్‌ఆర్టిసి రవాణా సౌకర్యం కల్పించాలని, పరీక్షలనిర్వహణ సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, మెడికల్ క్యాంపుల ఏర్పాటు చూడాలని అన్నారు.
పరీక్షా కేంద్రాలు : ఎస్.వి.ఆర్ట్స్ కళాశాల వింగ్ ''ఎ'' లో 600 మంది , వింగ్ ''బి'' లో 600 మంది, శ్రీ పద్మావతిమహిళా డిగ్రీ, పి జి కళాశాల లో 600 మంది, శ్రీ పద్మావతి బాలికల ఉన్నత పాటశాలలో 300 మంది, ఎస్.వి.యునివర్సిటీ కాంపస్ హైస్కూల్ నందు 225 మంది అభ్యర్థులు ఈ అర్హత పరీక్ష రాయనున్నారని వివరించారు. ఈ సమీక్షలో పరీక్షా కేంద్రాల సూపర్‌వైజర్లు విద్యుత్ శాఖ డి ఇ శ్రీనివాసులు, ఆర్ టి సి ఎటిఎం డి ఆర్ నాయుడు , మెడికల్ ఆఫీసర్ ఉదయశ్రీ ,డి టి రామచంద్ర , పోలిస్ డిపార్ట్ మెంట్ బాలచంద్ర రాజు పాల్గొన్నారు.










