Apr 11,2023 00:33

సమావేశంలో మాట్లాడుతున్న దీనబంధు

ప్రజాశక్తి -ములగాడ : పెన్షనర్ల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 20న విశాఖ ఎంపీ ఎంవివి.సత్యనారాయణ ఇంటి ముందు భిక్షాటన చేపట్టనున్నట్లు పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు కె.దీనబంధు తెలిపారు. వెంకన్నపాలెంలోని సిఐటియు కార్యాలయంలో సోమవారం ఇపిఎఫ్‌-95 పెన్షనర్ల సమావేశం నిర్వహించారు. సిహెచ్‌.తమ్మారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో దీనబంధు మాట్లాడుతూ, కనీస పెన్షన్‌ రూ.9 వేలు, డిఎ, భార్యాభర్తలిద్దరికీ ఇఎస్‌ఐ సదుపాయం కల్పించాలని కోరుతూ ఎంపీ ఇంటి ముందు భిక్షాటన చేస్తూ గిన్నెలతో తాళాలు కొట్టి నిరసనను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్లు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. పెన్షనర్ల సమస్యపై హ్యుమన్‌ రైట్స్‌ కమిషన్‌కు లేఖ రాస్తామని చెప్పారు. పెన్షనర్ల సంఘం మల్కాపురం జోన్‌ కార్యదర్శి కె.నూకరాజు మాట్లాడుతూ, హయ్యర్‌ పెన్షన్‌ గురించి గందరగోళంగా ఉందన్నారు. ఇపిఎఫ్‌ లింకు ఓపెన్‌ కావడంలేదని, ఇచ్చిన వివరాలు పూరించటం కష్టంగా ఉందని, దీనిపై పిఎఫ్‌ కమిషనర్‌ స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్‌.సూర్యారావు, కె.అప్పారావు, పెన్షనర్లు పాల్గొన్నారు.