ప్రజాశక్తి - టి.నరసాపురం
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 20న విజయవాడలో సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం.నాగమణి పిలుపునిచ్చారు. ఈ మేరకు మండలంలోని మల్లుకుంట, వల్లంపట్ల, బోరంపాలెం, వెంకటాపురం, మధ్యాహ్నపువారిగూడెం, ఎపికుంట, టి.నరసాపురం పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులను సమస్యలు తెలుసుకుంటూ గురువారం కరపత్రాలు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. నూతన మెనూ వల్ల కార్మికులు అప్పుల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గ్యాస్ ధర పెంపుతో నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన నిత్యవసర వస్తు ధరలకు అనుకూలంగా మెనూ ఛార్జి రూ.20 ఇవ్వాలని, గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తుమ్మల సత్యనారాయణ, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.










