Mar 16,2023 21:15

పోస్టర్లు విడుదల చేస్తున్న నాయకులు

20న చలో విజయవాడ
- జయప్రదం చేయండి : సిఐటియు, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌
ప్రజాశక్తి - నంద్యాల

      రాష్ట్ర ముఖ్యమంత్రి అంగన్వాడీ వర్కర్స్‌కు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కోసం ఈ నెల 20న జరుగు చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు, అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కోరారు. గురువారం స్థానిక నరసింహయ్య భవన్లో జిల్లా కమిటీ సమావేశం వెంకటలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి.యేసురత్నం ఏ.నాగరాజు, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి నిర్మలమ్మ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్‌కు అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతున్నా ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. అంగన్వాడీలకు గ్రాడ్యూటీ అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ అమలుకు బిల్లులు సక్రమంగా చెల్లించడం లేదని తెలిపారు. అంగన్వాడీలు అప్పు చేసి సెంటర్లు నడపాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. గత ఐదు సంవత్సరాలుగా టిఏలు చెల్లించడం లేదని తెలిపారు. రకరకాల యాప్‌లను తీసుకొచ్చి పని భారాన్ని పెంచారన్నారు. అంగన్వాడీలకు ఇచ్చిన సెల్‌ఫోన్లు పనిచేయడం లేదన్నారు. అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి నేటికీ చెల్లించడంలేదన్నారు. సెంటర్లను బలోపేతం చేయడానికి నిధులను పెంచి, అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఫుడ్‌ కమిషనర్‌ విజిట్ల పేరుతో అంగన్వాడీలను అవమానపరుస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని, అంగన్వాడీలు మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యం పాలవు తున్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ అమలు కావడం లేదన్నారు. అంగన్వాడీలకు ఫేస్‌ యాప్‌ రద్దు చేయాలన్నారు. పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలన్నారు. వైయస్సార్‌ సంపూర్ణ పోషణ మెను చార్జీలు పెంచాలని, గ్యాస్‌ ప్రభుత్వమే సరఫరా చేయాలని వారు కోరారు. 2017 నుండి పెండింగ్లో ఉన్న టీఏలను వెంటనే చెల్లించాలని, లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్‌ లీవులు ఇవ్వాలని, సర్వీస్‌లో ఉండి చనిపోయిన కుటుంబాలకు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, హామీలు అమలు చేయాలని తదితర డిమాండ్స్‌ సాధనకు ఈ నెల 20న జరిగే చలో విజయవాడ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ అందరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం చలో విజయవాడ పోస్టర్లను విడుదల చేశారు. సమావేశంలో సునీతమ్మ, నిర్మలమ్మ, లలితమ్మ, వసంతమ్మ, సావిత్రి, వెంకటమ్మ, సునీత, మరియమ్మ, రమణమ్మ, శ్యామల, రేణుక, అమితాబి, అరుణ, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.