ప్రజాశక్తి-కాకినాడ ఈ నెల 20వ తేదీలోగా ఓటర్ల జాబితా ఇంటింటి తనిఖీ ప్రక్రియ పూర్తిచేసేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సూచించారు. గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు ఇఆర్‌ఒలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టరేట్ కోర్టుహాల్ నుంచి కలెక్టర్ కృతికా శుక్లా, డిఆర్‌ఒ కె.శ్రీధర్ రెడ్డి, ఇఆర్‌ఒలతో కలిసి హాజరయ్యారు. భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా బిఎల్‌ఒలతో చేపట్టిన ఓటర్ల జాబితా ఇంటింటి తనిఖీ ప్రక్రియ పురోగతిని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అడిగి తెలుసుకున్నారు. లక్ష్యాలకు అనుగుణంగా సర్వేను పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. అనంతరం కలెక్టర్ కృతికా శుక్లా అధికారులలో మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో 58.15 శాతం మేర ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తయినందున ఈ నెల 20వ తేదీలోగా 100 శాతం ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కాకినాడ ఆర్‌డిఒ ఎన్‌వివి.సత్యనారాయణ, పెద్దాపురం ఆర్‌డిఒ జె.సీతారామరావు, కాకినాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ సిహెచ్.నాగ నరసింహారావు, కాకినాడ సెజ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.మనోరమ, కుడా విసి సుబ్బారావు, బిసి కార్పొరేషన్ ఇడి ఎస్‌విఎస్.సుబ్బలక్ష్మి, ఎన్నికల డిటి ఎం.జగన్నాథం హాజరయ్యారు.










