ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : 20ఎ సిటీ బస్సును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ వార్వా, నివాస్, హెచ్‌బి కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఆదివారం హెచ్‌బి.కాలనీ లాస్ట్ బస్సు స్టాప్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వార్వా, నివాస్ ప్రతినిధులు మాట్లాడుతూ, కరోనా సమయంలో ఈ బస్సును రద్దు చేశారని తెలిపారు. రెసిడెంట్స్ ఎక్కువగా ఉండే ఈ ప్రాంత ప్రజలకు ఈ సిటీ బస్సు చాలా ఉపయోగకరంగా ఉండేదని, దీన్ని రద్దు చెయ్యడం వలన జగదాంబ పూర్ణా మార్కెట్, వన్ టౌన్ ప్రాంతాలకు వెళ్లేందుకు సిటీ బస్సు సౌకర్యం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. బస్సు లేకపోవడంతో జగదాంబ తదితర ప్రాంతాలకు వెళ్లేందకు రూ.40 ఖర్చు చేయాల్సి వస్తోందని తెలిపారు. గతంలో ఆర్‌టిసి ఆర్‌ఎంను కలిసి వినతిపత్రం సమర్పించామని, బస్సులు ఖాళీగా నడుస్తున్నాయని వింత వాదనలు చేస్తున్నారని చెప్పారు. కనీసం రద్దీగా ఉండే సమయంలోనైనా, రూటు దూరం పెంచయినా 20ఎ బస్సును నడపాలని కోరారు. సామాజిక సదుపాయాలను లాభార్జనతో ముడి పెట్టడం సరికాదని ఆర్‌టిసి అధికారులు గుర్తించాలని కోరారు. రద్దు చేసిన రూట్లలో తిరిగి బస్సులను నడపడానికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ ఫిల్మ్ సొసైటీ అధ్యక్షులు నరవ ప్రకాశరావు, డాక్టర్ కె.రమాప్రభ, వార్వా ప్రధాన కార్యదర్శి బిబి.గణేష్, మద్దిలపాలెం కార్యదర్శి కెఎం.కుమారమంగళం, హెచ్‌బి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు బుగత సత్యనారాయణ, కె.సత్యవతి, కె.దేముడు, జి.మధు, కూర్మేష్, జివి.రమణ, బి.రాజు తదితరులు పాల్గొన్నారు.










