ప్రజాశక్తి-హెల్త్ యూనివర్శిటీ: క్షయ వ్యాధి నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, రోగులను గుర్తించి చికిత్సతో పాటు పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా 2025 నాటికి క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జిల్లా క్షయ వ్యాధి నివారణ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ. నేటి నుండి 21 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా క్షయ వ్యాధి నివారణపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. వైద్య అధికారులు సిబ్బంది ప్రతి గ్రామంలోను ప్రర్యటించి క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి మెరుగైన చికిత్సను అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలలో నిర్వహించే వైద్య పరీక్షలలో క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తిస్తే సంబంధిత రోగుల సమాచారాన్ని తప్పనిసరిగా జిల్లా క్షయ నివారణ అధికారిని దృష్టికి తీసుకురావాలన్నారు. జిల్లాలో సుమారు 3 వేల మందికి పైగా క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించడం జరిగిందన్నారు. రోగులకు ప్రభుత్వ పరంగా చికిత్స నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేయడంతో పాటు ప్రతి నెల 500 రూపాయలను ఆర్థిక సహాయం కింద అందిస్తున్నామన్నారు. దాతలు ముందుకు వచ్చి రోగులకు ఆరు నెలల పాటు పౌష్టికాహారాన్ని అందించగలిగితే ప్రభుత్వం అందించే మందుల ద్వారా వ్యాధిని నివారించగలుగుతామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, ఇండియన్ రెడ్‌క్రాస్ సోసైటీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ జి.సమరం, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ జె.ఉషారాణి, డియంహెచ్‌వో డాక్టర్ యం.సుహాసిని, ఆర్‌యంవో నాగేశ్వరరావు, డిప్యూటి డియంహెచ్‌వో డా. నళిణి దేవి తదితరులు పాల్గొన్నారు.










