Oct 14,2023 22:25

వేదికపై సిపిఎం కేంద్రకమిటి సభ్యులు మరియం థావలే, సామాజిక కార్యకర్త వసుంధర , ప్రసంగిస్తున్న ధనలక్ష్మి

2024నుంచే మహిళా రిజర్వేషన్‌ అమలు చేయాలి
స్కీం వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలి సిపిఎం రాష్ట్ర మహిళా సదస్సు డిమాండ్‌
ప్రజాశక్తి - తిరుపతి సిటి
'మహిళలంటే తనకు ఎనలేని గౌరవమని, అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటానని నిత్యం ప్రగల్భాలు పలికే సిఎం జగన్మోహన్‌రెడ్డి మహిళాభివృద్ధికి ఓ 'బటన్‌' నొక్కాలి' అని సిపిఎం రాష్ట్ర మహిళా సదస్సు డిమాండ్‌ చేసింది.. నవరత్నాలు ఇస్తున్నట్లే స్కీం వర్కర్లకు కనీస వేతనం 26వేలివ్వాలన్నారు. దిశ చట్టానికి దశ దిశ లేకుండా పోయిందన్నారు. మహిళలకు రక్షణ లేకుండా చేస్తున్న బిజెపికి ఒక్క ఓటు వేసినా చేటేనని సదస్సు ఉద్ఘాటించింది. మోడీకి చిత్తశుద్ధి ఉంటే మహిళా రిజర్వేషన్‌ను 2024 ఎన్నికల నుంచే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 'అసమానతలు లేని అభివృద్ధి' నినాదంతో తిరుపతి టిఎంఆర్‌ కల్యాణ మండపంలో రాష్ట్ర మహిళా సదస్సు సిపిఎం తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం జరిగింది. సదస్సుకు సిపిఎం జిల్లా కమిటి సభ్యురాలు పి.సాయిలక్ష్మి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా సిపిఎం కేంద్రకమిటి సభ్యురాలు మరియం థావలే ప్రసంగించారు. సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ మహిళలకు రక్షణ లేకుండా చేస్తున్న కేంద్రంలోని బిజెపికి ఓటు వేస్తే మహిళలు వంటింటికే పరిమితమయ్యే ప్రమాదం ఉందన్నారు. బిజెపి హఠావో.. దేశ్‌కో బచావో అంటూ నినదించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేసేందుకు మోడీ పూనుకుంటే, అక్కడి ప్రజలు స్టీలుప్లాంట్‌ను రక్షించుకునేందుకు వెయ్యి రోజుల పైగా స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమం చేయడాన్ని ప్రశంసించారు. దేశంలో ఆకలి సూచి పెరిగి, ప్రజలకు పౌష్టికాహారం లోపించి, రక్తహీనతతో బాధపడుతున్నారని, అయితే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నేషనల్‌ సర్వే లెక్కలను సైతం దాచి పెడుతోందన్నారు. సామాజిక కార్యకర్త కె.వసుంధర మాట్లాడుతూ మహిళలు బాగుంటేనే సమాజం బాగుంటుందన్నారు. మహిళా సాధికారిత కావాలంటే విద్య, ఆర్థిక స్వాతంత్య్రం, ఆరోగ్యం, రాజకీయ అధికారం, సాంఘిక సంక్షేమం కీలకమన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని తీసుకొస్తామని చెప్పిన సిఎం జగన్మోహన్‌రెడ్డి, లిక్కర్‌ బావరేజ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కి 25 సంవత్సరాలు మద్యం పాలసీని తాకట్టు పెట్టి వారిచ్చే డబ్బుతో నాడు-నేడు, అమ్మఒడి, ఆసరా పథకాలను అమలు చేస్తున్నారన్నారు. చంద్రయాన్‌ -3 విజయవంతమైన రోజే ఓ బాలిక అత్యాచారానికి గురై తీవ్ర రక్తస్రావంతో ఆదుకోవాలని వీధుల్లో అచేతన స్థితిలో తిరిగినా స్పందించలేని దౌర్భాగ్య స్థితిని మోడీ తీసుకొచ్చారన్నారు. ఆరోగ్యశ్రీ పేరుతో కార్పొరేట్‌ ఆస్పత్రులకు కోట్లు కుమ్మరిస్తున్న జగన్‌ప్రభుత్వం, పిహెచ్‌సిలను కార్పొరేట్‌ స్థాయికి ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు డి.రమాదేవి, సుబ్బరావమ్మ మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చాక మహిళలపై అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులు అధికమయ్యాయన్నారు. బిజెపి పాలిత ప్రాంతాల్లో సాక్షాత్తు ముఖ్యమంత్రులు, మంత్రులే నిందితులకు వత్తాసు పలుకుతూ మహిళలకు న్యాయం జరగకుండా అడ్డుకుంటున్నారని కొన్ని ఘటనలను వివరించారు. సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యురాలు డి.ధనలక్ష్మి మాట్లాడుతూ సనాతనం వైపా, సమసమాజం వైపా అన్నది మహిళలు తేల్చుకునే సమయం ఆసన్నమయ్యిందన్నారు. సనాతనం కావాలనుకునే మహిళలంతా భర్తలు చనిపోతే సతీసహగమనం చేయడం, వారి పిల్లలకు బాల్య వివాహాలు చేయడం చేస్తారా? అని ప్రశ్నించారు.
సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్‌ జిల్లా కార్యదర్శులు వందవాసి నాగరాజు, పి.మురళి, రాయపనేని హరిక్రిష్ణలు మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం, సమసమాజం కోసం మహిళలు చేసే ఏ పోరాటానికైనా తమ సంఘీభావం ఉంటుందన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మూలం రమేష్‌, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందారపు మురళి, టి.సుబ్రమణ్యం, చిత్తూరు జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, సిపిఐ నగర కార్యదర్శి విశ్వనాథ్‌ పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి పాటలు అందరినీ అలరించాయి. పాఠశాల, కళాశాల విద్యార్థులు చేసిన నృత్యాలు, సమసమాజ దిశగా వక్తల ప్రసంగాలతో మహిళా రాష్ట్ర సదస్సు విజయవంతంగా ముగిసింది.
వేదికపై సిపిఎం కేంద్రకమిటి సభ్యులు మరియం థావలే, సామాజిక కార్యకర్త వసుంధర , ప్రసంగిస్తున్న ధనలక్ష్మి