Sep 03,2023 22:46

ఫొటో : మాట్లాడుతున్న రాజ్యసభ ఎంపి, జిల్లా వైసిపి అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి

2024లోనూ రామిరెడ్డిని గెలిపించాలి
- రాజ్యసభ ఎంపి, జిల్లా వైసిపి అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి
ప్రజాశక్తి-కావలి : స్థానిక ఎంఎల్‌ఎగా రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి (మరో)మూడో సారి పోటీ చేయనున్నారని, చిన్న చిన్న మనస్పర్థలు ఏమైనా ఉంటే వాటిని పక్కన పెట్టి ఆయన గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజ్యసభ ఎంపి, జిల్లా వైసిపి అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని 34వ వార్డులో ఆదివారం ''గడపగడపకు మన ప్రభుత్వం'' కార్యక్రమం 175వ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి, రాజ్యసభ ఎంపి, జిల్లా వైసిపి అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి విచ్చేశారు. ముందుగా ట్రంక్‌ రోడ్డులోని వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం బైక్‌ ర్యాలీగా బయల్దేరి స్థానిక మానస సెంటర్‌కు చేరుకున్నారు. స్థానిక 34వ వార్డు ఇన్‌ఛార్జులు గుర్రం వెంకటేశ్వర్లు, పుల్లా శ్రీనివాసులు రెడ్డి వీరికి పుష్పగుచ్ఛాలతో, శాలువాలతో ఘన స్వాగతం పలికారు. కేరళ వాయిద్యాలు నడుమ ప్రారంభమైన సభా కార్యక్రమంలో వినూత్న రీతిలో క్రేన్‌, సాయంతో భారీ గజమాలను ఎంఎల్‌ఎ, ఎంపిలకు వేశారు. ఈ మేరకు జగన్మోహన్‌ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కళుగోళ శాంభవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గడపగడపకు తిరిగి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయా.. లేదా.. అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఎంఎల్‌ఎ వార్డులోని ప్రజలకు తెలియజేశారు. 175వ రోజు కావడంతో నాయకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ ఈ సారి నెల్లూరు ఎంపిగా పోటీ చేయనున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.