Jan 24,2022 20:11

న్యూఢిల్లీ : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024లో బిజెపిని ఓడించొచ్చని అన్నారు. వచ్చే నెలలో జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా... అది సాధ్యపడవచ్చునని అన్నారు.  మోడీ సర్కార్ ను ఓడించగల ప్రతిపక్ష కూటమి ఏర్పడేందుకు తాను సాయపడాలనుకుంటున్నట్లు తెలిపారు. ' 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని ఓడించడం సాధ్యమే. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రతిపక్షం (కాంగ్రెస్‌) ఓడించడం సాధ్యమా అంటే కాదనే చెప్పాలి. కానీ పార్లమెంట్‌ ఎన్నికల్లో బలమైన పోరాటాన్ని అందించగల ప్రతిపక్ష ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడంలో సాయం చేయాలనుకుంటున్నా' అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. హిందూత్వ, జాతీయ వాదం, సంక్షేమం వంటి అంశాలను బిజెపి ఆయుధంగా మలచుకుని.. బలమైన కథనాన్ని అల్లుతుందని, ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీలు రెండు అసెంబ్లీల్లో అయినా గెలుపొందాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. 543 లోక్‌సభ స్థానాలకు గానూ.. 200 లోక్‌సభ స్థానాలకు సంబంధించి బిజెపి, కాంగ్రెస్‌ మధ్య ద్విముఖ పోటీ నెలకొందని అన్నారు. గత రెండు ఎన్నికల్లో అధికార పార్టీ 95 శాతం గెలుపొందడం ద్వారా 190 సీట్లను పొందిందని పేర్కొన్నారు.
బిజెపిని ఓడించాలనుకునే ఏ పార్టీ లేదా నేతైనా 5-10 సంవత్సరాల దృక్పథం ఉండాలని, ఐదు నెలల్లో సాధ్యం కాకపోవచ్చునని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల తర్వాత దాదాపు ఐదు నెలల చర్చల తర్వాత కాంగ్రెస్‌తో జట్టుకట్టేందుకు చేపట్టిన చర్చలు విఫలమయ్యాయని అన్నారు. కాంగ్రెస్‌తో తాను పనిచేయడం ఇతరులకు సహజంగానే కనిపిస్తుందని, కానీ కలిసి పనిచేయడానికి రెండు వైపులా విశ్వాసం పెరగాలని అన్నారు. కాంగ్రెస్‌తో అలా జరగలేదని అన్నారు. కాంగ్రెస్‌ను అభినందిస్తానని, అది లేకుండా ప్రతిపక్ష కూటమి సాధ్యం కాదని, అయితే బిజెపిని ఓడించేందుకు కాంగ్రెస్‌కు పునరుజ్జీవం అవసరమని అన్నారు.