Jul 24,2021 07:10

న్యూఢిల్లీ : ఢిల్లీ కేంద్రంగా పనిచేసే కాశ్మీరీ జర్నలిస్టులు, జమ్ము కాశ్మీర్‌ పట్ల కేంద్రం విధానాలను తీవ్రంగా విమర్శించే ప్రముఖ పౌర సమాజ కార్యకర్త, కాశ్మీర్‌కి చెందిన మరో 25మందిపై 2017 నుండి 2019 మధ్య భాగం వరకు నిఘా వున్నట్లు ది వైర్‌ వెబ్‌సైట్‌ శుక్రవారం పేర్కొంది. ఎన్‌ఎస్‌ఓ గ్రూపు క్లయింట్‌గా భావిస్తున్న గుర్తు తెలియని ప్రభుత్వ సంస్థ ఈ నిఘా కార్యకలాపాలను నిర్వహించిందని వైర్‌ నివేదిక పేర్కొంది. పెగాసస్‌ ప్రాజెక్టుకు అందుబాటులోకి వచ్చిన రికార్డులకు నిఘాతో ఎలాంటి సంబంధం లేదంటూ ఇజ్రాయిల్‌ సంస్థ ఎన్‌ఎస్‌ఓ ఖండించింది. వేర్పాటువాద నేత బిలాల్‌ లోనె, ఎస్‌.ఎ.ఆర్‌.జిలానీ ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని ఫోరెన్సిక్‌పరంగా నిర్ధారితమైందని వైర్‌ తన నివేదికలో తెలిపింది. కాశ్మీర్‌లో లక్ష్యాలుగా మారిన వారి ఫోన్లపై ఫోరెన్సిక్‌ విశ్లేషణ నిర్వహించడం సాధ్యం కాలేదని తెలిపింది. లీకైన డేటాబేస్‌లో నెంబరు వుంటే ఆ ఫోన్‌ తప్పనిసరిగా హ్యాక్‌ అయిందని భావించాల్సిన అవసరం లేదని పేర్కొంది.