Jun 04,2023 23:38

మాట్లాడుతున్న సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు

ప్రజాశక్తి -విఆర్‌.పురం
పోలవరం నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్ట ప్రకారం పరిహారం, పునరావాసం కల్పించాలని సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు డిమాండ్‌ చేశారు. ఆదివారం మండలంలోని చొక్కనపల్లి, చిన్నమట్టపల్లి గ్రామాల్లో నిర్వహించిన పాదయాత్ర సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు శాపంగా మారిందన్నారు. చట్టం ప్రకారం నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం, పునరావాసం ఇవ్వకుండా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నెట్టుకోవడం దారుణమన్నారు. నిర్వాసితుల సమస్యలపై ఈ నెల 20 నుండి జులై 9 వరకు నెల్లిపాక నుండి విజయవాడ వరకు 18 రోజులు 400 కిలోమీటర్లు, 1000 మందితో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముంపు గ్రామాలను కలుపుతూ సాగే ఈ పాదయాత్రకు నిర్వాసితులు అధిక సంఖ్యలో కదిలి రావాలని పిలుపునిచ్చారు. గోదావరి వరదల నుండి నిర్వాసితులను రక్షించేలా మందస్తు చర్యలు తీసుకోవాలని, గత వరదల్లో నష్టపోయిన వరకు పరిహారం ఇవ్వాలని, తప్పుల తడకగా ఉన్న కాంటూర్‌ లెక్కలు మార్చాలని, శాస్త్రీయ పద్ధతిని అనుసరించి సర్వేలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో పార్టీ మండల నాయకులు తోడం రాజు, గుండెపూడి లక్ష్మణరావు, పంకు సత్తిబాబు, సున్నం దూలయ్య, కారం కృష్ణమూర్తి, సోడి మల్లయ్య, కారం దారయ్య, ఆత్మకూరు కాంతారావు, సోడి భుబామ్మ, పండ వెంకటేశ్వర్లు, సోడి రాజారావు, మాజీ సర్పంచ్‌ పులి సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.