- వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్
ప్రజాశక్తి - పెద్దాపురం
ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంత కూలీలకు 200 రోజులు పని కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కెఎస్ శ్రీనివాస్ అన్నారు. శనివారం స్థానిక పంగిడి చెరువు వద్ద ఉపాధి పనులు చేస్తున్న కాండ్రకోట, గుడివాడ, మరలావ ఉపాధి కూలీలతో నిర్వహించిన సమా వేశంలో ఆయన మాట్లాడుతూ 2005లో యుపిఎ ప్రభుత్వం-1లో వామపక్షాల ఒత్తిడితో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారన్నారు. నాడు ఐదు కోట్ల మంది ఈ పథకంలో చేరితే నేడు 20 కోట్ల మంది ఈ పథకలో ఉపాధి పొందుతున్నారన్నారు. కేంద్రంలో ప్రస్తుత బిజెపి ప్రభుత్వం ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. 2022 -23 బడ్జెట్లో ఈ పథకం నిమిత్తం 90 వేల కోట్లు కేటాయిస్తే, ఈ ఏడాది 60 వేలం కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. క్రమేపి ఈ పథకాన్ని రద్దు చేసే దిశలో బిజెపి ప్రభుత్వం పావులు కదుపుతుందన్నారు. ఉపాధి కూలీలకు రూ.257 మాత్రమే కూలి ఇస్తున్నారన్నారు. 4 వారాలుగా ఈ కూలి బకాయిలు చెల్లించడం లేదన్నారు. ఉపాధి కూలీలకు రోజుకు రూ.500 వేతనం లభించేలా చూడాలన్నారు. వ్యవసాయ రంగం యాంత్రీకరణ వల్ల ఉపాధి కోల్పోయిన గ్రామీణ కూలీలకు ఈ ఉపాధి పథకం పనులు పెద్ద దిక్కుగా ఉన్నాయన్నారు. అందరూ కలిసి కట్టుగా ఈ ఉపాధి పథకాన్ని రక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్ష, కార్యదర్శులు గడిగట్ల సత్తిబాబు, డి.క్రాంతి కుమార్, నీలపాల సూరిబాబు పాల్గొన్నారు.
ఉపాధి కూలీల సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివాస్










