Aug 31,2023 22:39

2,700 కిలో మీటర్లు దాటిన పాదయాత్ర
సీతంపేటలో పైలాన్‌ ఆవిష్కరణ
పాల్గొన్న తల్లి భువనేశ్వరి, నారా, నందమూరి కుటుంబ సభ్యులు
కొయ్యలగూడెంలో గిరిజనులతో ముఖాముఖీ
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి/కొయ్యలగూడెం

టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన పాదయాత్ర గురువారం 200 రోజులు, 2,700లోమీటర్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా కొయ్యలగూడెం మండలం సీతంపేటలో పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ యాత్రలో లోకేష్‌ తల్లి భువనేశ్వరితో పాటు నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొని నడిచారు. పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలంలో యువగళం యాత్ర ఉత్సాహంగా ముందుకు సాగింది. గిరిజన మహిళలు లోకేష్‌కు రాఖీలు కట్టారు. దారిలో జనాన్ని పలకరిస్తూ, కరచాలనం చేస్తూ, ఫొటోలు దిగుతూ లోకేష్‌ ముందుకు సాగారు. ఈ సందర్భంగా నరసన్నపాలెం, బయ్యనగూడెం గ్రామస్తులు తమ సమస్యలపై లోకేష్‌ను కలిసి వినతిని అందించారు. టిడిపి అధికారంలోకి రాగానే సమస్యలను పరిష్కరిస్తామని లోకేష్‌ వారికి హామీ ఇచ్చారు. అనంతరం కొయ్యలగూడెంలో గిరిజనులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులతో లోకేష్‌ కొద్దిసేపు నృత్యం చేశారు. అనంతరం గిరిజన నాయకుడు వెంకటప్ప గిరిజనులు ఎదుర్కొంటున్న పలుసమస్యలను లోకేష్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన మాట్లాడుతూ వంద రోజుల పాదయాత్ర సందర్భంలో చెంచులతో, 200 రోజులు పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా పోలవరంలో గిరిజనులతో సమావేశం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. గిరిజనులను ఆర్థికంగానూ, రాజకీయంగానూ ఉన్నతస్థితికి తీసుకురావడానికి టిడిపి ఎంతో కృషి చేసిందన్నారు. ఐటిడిఎలను అప్పటి సిఎం నందమూరి తారకరామారావు అని తెలిపారు. చంద్రబాబు ఎస్‌టి సబ్‌ ప్లాన్‌ను పక్కాగా అమలు చేశారన్నారు. తాను పంచాయతీ రాజ్‌మంత్రిగా 500 మంది జనాభా ఉన్న తండాలను పంచాయతీలుగా గుర్తిం చామని తెలిపారు. రోడ్లు, తాగునీటి ప్రాజెక్టులు, ఇంటర్నెట్‌, మొబైల్‌ నెట్‌వర్క్‌ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను గిరిజనులకు అందించామని చెప్పారు. గిరిజనులకు ఎన్ని చేసినా తక్కువేనన్నారు. సిఎం జగన్‌ అధికారంలోకొచ్చాక గిరిజనుల గొంతు కోశారని విమర్శించారు. చంద్రబాబు అరకు కాఫీ ప్రమోట్‌ చేస్తే, జగన్‌ గంజాయి ప్రమోట్‌ చేస్తున్నారన్నారు. ఎస్‌టి సబ్‌ ప్లాన్‌ నిధులను వైసిపి ప్రభుత్వం దారిమళ్లిం చిందన్నారు. గిరిజనుల చేతిలో ఉన్న భూములను, సహజ సంపదను వైసిపి నేతలు దోపిడి చేస్తున్నారని విమర్శించారు. గిరిజనులపై వైసిపి నేతలు దాడులు చేస్తున్నారని, జగన్‌ 16 గిరిజన సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారని తెలిపారు. ఐటిడిఎలను నిర్వీర్యం చేశారన్నారు. గిరిజన మహిళ గుమ్మడి సంధ్యారాణికి టిడిపి హయాంలో ఎంఎల్‌సి ఇచ్చామని గుర్తుచేశారు. గిరిజనులకు మెరుగైన రాజకీయ అవకాశాలు టిడిపి కల్పిస్తుందన్నారు. గిరిజన బ్యాక్‌లాగ్‌ పోస్టులన్నీ భర్తీచేస్తామని, గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకే ఉద్యోగాలు రావాలన్నది టిడిపి విధానంమని, జిఒ3ను పక్కగా అమలు చేసింది టిడిపినేనని, తెలిపారు. జిఒ3 అమలు కోసం టిడిపి పోరాడుతుందన్నారు. జగన్‌ ఎన్నికల ముందు గిరిజనుల కోసం 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, 45 ఏళ్లు నిండిన ఎస్‌టి మహిళలకు పెన్షన్‌, 500మంది జనాభా దాటిన తండాలను పంచాయతీలుగా గుర్తిస్తామని చెపి మోసం చేశారని విమర్శించారు. జగన్‌ నిధులు, విధులు లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారన్నారు. ఒక్క రుణం కూడా ఇవ్వలేదని చెప్పారు. టిడిపి రాగానే దామాషా ప్రకారం గిరిజన ఉపకులాలకు సబ్సిడీ రుణాలు కార్పొరేషన్ల ద్వారా ఇస్తామని ప్రకటించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే టిడిపి లక్ష్యమన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసి అరకు కాఫీ తరహాలో ఇతర ఉత్పత్తులను కూడా దేశవ్యాప్తంగా ప్రమోట్‌ చేస్తామని, గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టే వారికి ప్రత్యేక రాయితీలిస్తామని, ఏకో టూరిజాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామన్నారు. ఫలితంగా గిరిజన ప్రాంతాల్లో యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. పోలవరం నిర్వాసితులకు జగన్‌ అనేక హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు. జగన్‌ ప్రభుత్వంలో గిరిజనులు సర్టిఫికెట్లు తీసుకోవడం కూడా కష్టంగా మారిందన్నారు. రాజకీయాల కోసం గిరిజనేతరులకు కూడా గిరిజనుల సర్టిఫికెట్లు ఇస్తున్నారని విమర్శించారు. గిరిజనులకు నష్టం లేకుండా, విబేధాలు లేకుండా బోయ, వాల్మీకుల సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. తాము అధికారంలో ఉన్నప్పుడు 2018 డిఎస్‌సి ఏఆర్పటు చేశామని, ఐదేళ్ల పాలనలో రెండుసార్లు డిఎస్‌సి ప్రకటించామన్నారు. గిరిజన టీచర్‌ పోస్టులన్నీ భర్తీచేశామని, మరోసారి అవకాశం ఇస్తే గిరిజన ప్రాంతాల్లో విద్యావ్యవస్థను పటిష్టపరుస్తామని తెలిపారు. యుపిపిఎస్‌సి తరహాలో ఎపిపిఎస్‌సిని కూడా బలోపేతం చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్తకర్తలు పాల్గొన్నారు. శుక్రవారం గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలంలో పాదయాత్ర సాగనుంది.