Jun 13,2023 00:08

పట్టుబడిన గంజాయి, నిందితులతో చింతపల్లి సిఐ రమేష్‌, ఎస్‌ఐ రమణ

- ఇద్దరు అరెస్టు
ప్రజాశక్తి -సీలేరు

అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను అదుపులో తీసుకొని, వారి నుండి 200 కేజీల గంజాయిని సోమవారం చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధి అన్నవరం వద్ద చింతపల్లి ఎస్‌ఐ రమణ ఆధ్వర్యాన స్వాధీనం చేసుకున్నారు. చింతపల్లి ఏఎస్‌పి ప్రతాప్‌ శివ కిషోర్‌ తెలిపిన వివరాల ప్రకారం... ఎస్‌ఐ రమణ పోలీస్‌ సిబ్బంది లోతిగెడ్డ బ్రిడ్జి వద్ద సోమవారం ఉదయం వాహన తనిఖీలు చేపట్టారు. రాళ్లగడ్డ నుంచి లోతుగెడ్డ బ్రిడ్జి వైపు ఒక టీవీఎస్‌ స్కూటీపై ఇద్దరూ అతివేగంగా వస్తూ పోలీసులను చూసి వెనక్కి బండిని వెనక్కి తిప్పబోయి అదుపుతప్పి కింద పడిపోయారు. అక్కడే బండిని వదిలేసి పారిపోయారు. దీంతో అనుమానం వచ్చి వాహన తనిఖీలు చేయగా, అదే సమయంలో వస్తున్న రెండు కారులు పోలీసులను నిలిపివేసి, అందులో ఉన్న వారు పారిపోతుండగా పోలీసులు అప్రమత్తమై గోపిల్లి నవీన్‌, రుత్తల బోడకొండ అనే ఇద్దరిని అదుపులో తీసుకుని విచారించారు. కారులో గంజాయి రవాణా చేస్తున్నామని నిందితులు అంగీకరించారు. ఒక్కొక్క కారులో 100 కేజీలు గంజాయి చొప్పున 200 కేజీలు గంజాయి అక్రమంగా తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. కార్లకు పైలెట్‌గా వ్యవహరించిన ఇద్దరు వ్యక్తులతో, కారులో వచ్చిన మరో ముగ్గురు మొత్తం ఐదుగురు పరారయ్యారు. నిందితుల వద్ద నుంచి 200 కేజీల గంజాయి, రెండు కార్లు, ఒక స్కూటీ, ఒక కీప్యాడ్‌ మొబైల్‌, 2000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకొని సీజ్‌ చేశారు. పరారైన ఐదుగురు నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతన్నట్లు ఎఎస్‌పి తెలిపారు. అరెస్ట్‌ అయిన ఇద్దరు వ్యక్తులపై గంజాయి కేసులు ఉన్నాయని చెప్పారు. చాకచక్యంగా వ్యవహరించి గంజాయిని పట్టుకున్న ఎస్సై రమణ, పోలీస్‌ సిబ్బందిని జిల్లా ఎస్‌పి, చింతపల్లి ఎఎస్‌పి అభినందించారు. పట్టుబడిన నిందితుల్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ రమేష్‌, ఎస్‌ఐ రమణ పాల్గొన్నారు.