ప్రజాశక్తి - విశాఖపట్నం : ఈ నెల 26న నిర్వహించబోయే సాగరతీర స్వచ్ఛత కార్యక్రమాన్ని 20 వేల మందితో చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. సోమవారం ఉదయం తన కార్యాలయ వీడియో కాన్పరెన్స్ హాలులో జిల్లా అధికారులతో ఈ విషయమై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాగరతీర పరిరక్షణకు 'పార్లే' సంస్థ సహకారంతో సాగరతీర స్వచ్చత కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన 40 ప్రాంతాలలో బీచ్ క్లీనింగ్ ప్రోగ్రామ్ చేపడుతున్నట్లు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని, పర్యాటకులు ఎక్కువుగా సంచరించే తీర ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నామని అన్నారు. బీచ్ క్లీనింగ్ ప్రోగ్రామ్‌ను ఫొటోలు, వీడియోలు తీసి భద్రపరచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి కోసం అవసరమైన మంచినీరు, గ్లౌజులు, డస్ట్‌బిన్లు, డస్ట్ కలక్షన్ బ్యాగులను ఏర్పాటు చేయాలని జివిఎంసి అధికారులను కోరారు. విశాఖ నగరంలో 20 వేల మందితో బీచ్ క్లీనింగ్ ప్రోగ్రామ్ గిన్నిస్ రికార్డులో చేరే అవకాశముందని తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, నేవీ, పోలీస్, వాలంటీర్ సంస్థలు, విద్యా సంస్థలు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛందంగా అంకిత భావంతో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. అనంతరం ఈ కార్యక్రమం నిర్వహణపై ముఖ్యమంత్రికి ప్రజంటేషన్ ఇవ్వనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జివిఎంసి కమిషనర్ లక్ష్మీశ, జిల్లా అటవీ అధికారి రాహుల్ పాండే, డిసిపి సునీల్ సుమిత్ గరుడ్, డిఆర్‌ఒ శ్రీనివాసమూర్తి, ఆర్‌డిఒ హుసేన్ సాహెబ్, నేవీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.










