ప్రజాశక్తి-అనకాపల్లి
డైమండ్ హిట్స్ వ్యవస్థాపకులు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు సౌజన్యంతో, జ్యోతి సరళ కళాపరిషత్ ఆధ్వర్యంలో, ఎంహెచ్ స్కూల్ 1975 పదో తరగతి బ్యాచ్ విద్యార్థుల సహకారంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలను నిర్వహిస్తున్నట్టు కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. స్థానిక వివి రమణ రైతు భారతి ఆడిటోరియంలో బుధవారం నాటిక పోటీల గోడ పత్రిక, బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగాది పండుగను పురస్కరించుకొని ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకు మూడు రోజులపాటు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
నాటిక పోటీల వివరాలు
ఈ నెల 20న సాయంత్రం 6.30 గంటలకు విజయవాడ హర్ష క్రియేషన్స్ వారి 'స్వర్ణ కమలాలు', రాత్రి 8 గంటలకు చిలకలూరిపేట అంజన రాథోడ్ థియేటర్స్ వారి 'నాన్నా నేనొచ్చేస్తా', 21న సాయంత్రం 6.30 గంటలకు విశాఖపట్నం నటరాజ్ ఆర్ట్ క్రియేషన్స్ వారి 'ది లాస్ట్ జడ్జిమెంట్', 8 గంటలకు హైదరాబాద్ భూమిక థియేటర్స్ గ్రూప్ వారి 'బరిబత్తుల రాజు', 9 గంటలకు విశాఖపట్నం ఎస్‌జెఎస్ స్మారక కళాపరిషత్ వారి 'తపన', 21న సాయంత్రం 6.30 గంటలకు సర్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవా సంఘం వారిచే 'కొత్త పరిమళం', రాత్రి 8 గంటలకు కొప్పోలు పండు క్రియేషన్స్ వారి 'పక్కింటి మొగుడు' తదితర నాటికలు ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు.
అనంతరం ప్రముఖ సీనియర్ నటులు, నిర్మాత దర్శకులు పిళ్లా సన్యాసిరావుకు సన్మాన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఉత్తమ ప్రదర్శనకు రూ.5వేలు, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.3వేలు, తృతీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.2వేలు నగదు బహుమతులు ఉంటాయని చెప్పారు. ఈ పోటీలకు అందరూ ఆహ్వానితులేనన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సిహెచ్ నాయుడు, బి.జగత్రావు, కేఎం నాయుడు, నండూరి ప్రభాకర్ రావు, జిఎన్ మూర్తి, రాపేటి నారాయణరావు, మల్ల లోకేశ్వరరావు, భీశెట్టి కృష్ణ అప్పారావు, రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్ శిలపరశెట్టి బాబి తదితరులు పాల్గొన్నారు.










