Jul 16,2023 22:45

ప్రజాశక్తి - ఏలూరు
            మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని(ఆప్కాస్‌) పర్మినెంట్‌ చేయాలని, సిపిఎస్‌ రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, క్లాప్‌ ఆటోల డ్రైవర్లకు రూ.18,500 కనీస వేతనం ఇవ్వాలని కోరుతూ ఈనెల 20వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా దశలవారీ ఆందోళనలు చేపట్టాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపును జిల్లాలో జయప్రదం చేయాలని మున్సిపల్‌ వర్కర్స్‌ జిల్లా కమిటీ సమావేశం నిర్ణయించింది. యూనియన్‌ జిల్లా కమిటీ సమావేశం వినుకొండ రమేష్‌ అధ్యక్షతన సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగింది. సమావేశం వివరాలను యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.జాన్‌బాబు పత్రికలకు తెలిపారు. వైసిపి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల పర్మినెంట్‌ చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ ఈనెల 20వ తేదీన రాష్ట్రంలోని అన్ని మున్సిపల్‌ కార్యాలయాల వద్ద మహిళా కార్మికులు రిలే నిరాహార దీక్షలు, 21వ తేదీన అన్ని మున్సిపల్‌ కార్యాలయాల వద్ద పురుష కార్మికుల రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ నెల 27వ తేదీన రాష్ట్రంలోని అన్ని మున్సిపల్‌ కార్యాలయాలు ముట్టడించాలని, వచ్చేనెల ఏడో తేదీన జిల్లా కలెక్టరేట్లు ముట్టడించాలని యూనియన్‌ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపును జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్‌, నూజివీడు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి మున్సిపాలిటీల్లో జయప్రదం చేయాలని సమావేశం నిర్ణయించింది. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు 15వ తేదీ తర్వాత రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె చేపట్టాలని, దానికి కార్మిక వర్గమంతా సన్నద్ధం కావాలని సమావేశం పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా గౌరవ అధ్యక్షులు బి.సోమయ్య మాట్లాడుతూ సిఎం జగన్‌ 2019 ఎన్నికలకు ముందు మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని, మున్సిపల్‌ కార్మికులను నట్టేట ముంచారని విమర్శించారు. రాబోయే ఎన్నికలకు ముందైనా మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఆందోళనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఈ సమావేశంలో నూజివీడు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ఏలూరు కార్పొరేషన్లకు చెందిన యూనియన్ల అధ్యక్ష, కార్యదర్శులు, జిల్లా కమిటీ సభ్యులు, వివిధ విభాగాల నాయకులు బి.సోమయ్య, కారు దుర్గారావు, వీరంకి సాయిబాబు, బి.ఆంజనేయులు, ఎస్‌.శివకృష్ణ, కె.నాగరాజు, విజయకుమార్‌, డి.రాజు, వెంకటేష్‌, దిలీప్‌, వెలగాడి పద్మ, ఎం.కమల కుమారి, మధు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్త దశలవారీ ఆందోళన కార్యక్రమాల్లో మున్సిపల్‌ సిపిఎస్‌ ఉద్యోగులు, కార్మికులు కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ (ఆప్కాస్‌) ఉద్యోగులు, క్లాప్‌ ఆటోల డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని సమావేశం విజ్ఞప్తి చేసింది. చింతలపూడి మున్సిపల్‌ కార్మికులను ఆప్కాస్‌లో చేర్చాలని, హెల్త్‌ అలవెన్సులు అమలు చేయాలని సమావేశం కోరింది. జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో పెండింగ్‌లో ఉన్న మూడు నెలల హెల్త్‌ అలవెన్స్‌లు వెంటనే విడుదల చేయాలని సమావేశం డిమాండ్‌ చేసింది.