
ప్రజాశక్తి - తెనాలి : మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ప్రశాంతంగా ముగిసింది. చైర్‌పర్సన్ సయ్యద్ ఖలేదా నసీం అధ్యక్షతన కౌన్సిల్ హాలులో శనివారం సమావేశం నిర్వహించగా ప్రారంభంలోనే ప్రతిపక్ష నేత పసుపులేటి త్రిమూర్తి ఆధ్వర్యంలో టిడిపి సభ్యులు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికమని, ఆయన్ను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. చైర్ పర్సన్ జోక్యం చేసుకొని కౌన్సిల్ నిబంధనలు సభ్యులంతా పాటించాలని, పార్టీలకు, వ్యక్తులకు సంబంధించిన నిరసనలకు కౌన్సిల్లో అనుమతి లేదని టిడిపి సభ్యులను హెచ్చరించారు. రిబ్బన్లు తొలగించి ప్లకార్డులను కూడా తీసివేయాలని కోరారు. టిడిపి సభ్యులు ఇవేమీ పట్టించుకోపోవడంతో వైసిపి సభ్యులు టి.రామయ్య కలుగజేసుకున్నారు. నిరసనలు వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యంలో సాధారణమని, అయితే కౌన్సిల్ నిబంధనలను అతిక్రమించి ప్రదర్శనలు సరికాదని, సమావేశం జరిగేందుకు సహకరించాలని కోరారు. టిడిపి సభ్యులు అడుసుమల్లి వెంకటేశ్వరరావు స్పందిస్తూ మా పార్టీ అధినేతను అక్రమంగా అరెస్టు చేస్తే నిరసన తెలియజేసే హక్కు కూడా లేదా అంటూ ప్రశ్నించారు. ఈ పరిస్థితుల మధ్య చైర్ పర్సన్ మాట్లాడుతూ అజెండా మూడు రోజులు ముందుగానే సభ్యులకు అందజేశామని, అందులోని 40 అంశాలను ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం సమావేశం ముగిసిందంటూ నిష్క్రమించారు. 11:30 గంటలకు ప్రారంభమైన కౌన్సిల్ కేవలం 20 నిమిషాల్లోనే ముగిసింది. అజెండాపై చర్చించకుండానే ఆమోదం ప్రకటించడంపై టిడిపి సభ్యులు విమర్శించారు. కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ ఎం.జస్వంత్‌రావు ,వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.