Nov 18,2023 22:25

మున్సిపల్‌ కార్మికులనుద్దేశించి మాట్లాడుతున్న సిఐటియు జిల్లా కోశాధికారి వెంకటరమణ

పార్వతీపురం టౌన్‌: మున్సిపాల్టీల్లో ఆప్కాస్‌ విధానంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ తలపెట్టిన ఈనెల 20న ప్రదర్శనలు, 21న కలెక్టరేట్‌ వద్ద వంటావార్పు కార్యక్రమాల్లో కార్మికులంతా పాల్గొనాలని సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో ఉన్న పారిశుధ్య కార్మికులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికులందర్నీ రెగ్యులర్‌ చేయాలని, చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ప్రభుత్వానికి డిమాండ్‌ చేస్తామని అన్నారు. కార్యక్రమంలో కార్మికులు నాగవంశం శంకర్రావు, చీపురుపల్లి సింహాచలం, నాగవంశం మల్లేష్‌, మామిడి శివ, బంగారి రాజేష్‌, పాపులమ్మ, ఇప్పలమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు.
సాలూరు: మున్సిపల్‌ కార్మికులకు సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈనెల 20,21తేదీల్లో నిర్వహించనున్న నిరసన ప్రదర్శన, ధర్నా లను విజయవంతం చేయాలని మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా సహాధ్యక్షులు టి.రాముడు, సహాయ కార్యదర్శి టి.శంకరరావు, మహిళా కన్వీనర్‌ టి.ఇందు కోరారు. ఆందోళన కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు బాలరాజు పాల్గొన్నారు.