
ప్రజాశక్తి-ఎడ్యుకేషన్: విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించే లక్ష్యంతో కెఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ప్రతి ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ స్థాయి సాంకేతిక ఉత్సవం సమ్యక్‌ను ఈ నెల 20, 21 తేదీల్లో వడ్డేశ్వరంలోని గ్రీన్ ఫీల్డ్ క్యాంపస్‌లో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి.పార్థసారథి వర్మ అన్నారు. విజయవాడలోని పరిపాలన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సదస్సుకు దేశవ్యాప్తంగా ఆయా కళాశాలలు, యూనివర్సిటీలకు చెందిన సుమారు 15వేల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. రెండు రోజులు జరిగే ఈ సాంకేతిక సదస్సులో పలు సాంస్కతిక కార్యక్రమాలు, సదస్సులతో పాటు విద్యార్థుల ప్రదర్శనలు ఉంటాయన్నారుఏ. సమ్యక్‌కు చైర్మన్‌లుగా డాక్టర్ ఎ.శ్రీనాధ్, డాక్టర్ బి.జయకుమార్ సింగ్, కన్వీనర్‌లుగా డాక్టర్ ఎం.సుమన్, డాక్టర్ టి.పవన్ కుమార్, డాక్టర్ అమరేంద్ర, డాక్టర్ పి.వెంకటేశ్వర్లు వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ డీన్ డాక్టర్ ఎ.శ్రీనాధ్, కమిటీ సభ్యులు వినరు మాట్లాడుతూ ప్రాంతాలు, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు అనే తారతమ్యం లేకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ విద్యార్థులందరూ ఒకే వేదిక మీద జరుపుకునే సాంకేతిక పండుగ సమ్యక్ అని వివరించారు. ఈ కార్యక్రమంలో విసిలు డాక్టర్ ఎవిఎస్.ప్రసాద్, డాక్టర్ ఎన్.వెంకట్ రామ్, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, చరిష్మ, ఆస్రిత తదితరులు పాల్గొన్నారు.