ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ గురువారం గుంటూరు లోని వేర్వేరు ప్రదేశాల్లో నిర్వహిం చారు. రెండేళ్లపాటు ఒకేచోట పనిచేసిన వారు రిక్వెస్టు బదిలీలు కోరుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఉమ్మడి జిల్లాలో దాదాపు మూడు వేల వరకు ఖాళీలు న్నాయి. ఖాళీగా ఉన్న స్థానాల్లోనే బదిలీ కోరుకునే అవకాశం కల్పించారు. వ్యక్తిగత సమస్యలు, పిల్లల చదువులు, కుటుంబ సభ్యుల అనారోగ్య కారణాలతో పాటు భార్యభర్త వేర్వేరు ప్రాంతాల్లో పని చేస్తుంటే ఒకే ప్రదేశంలో పనిచేసేందుకు వీలుగా బదిలీ కోరుకున్న వారికి ప్రాధాన్యం ఇచ్చారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన తొలిదశ ప్రక్రియ పూర్తయిందని, అంతర్‌జిల్లాల బదిలీల ప్రక్రియ త్వరలో నిర్వహిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.
మహిళా పోలీసులకు స్థానిక పోలీసు కల్యాణ మండపం, విఆర్‌వోలకు కలెక్టరేట్‌లోని డిఆర్‌సి హాలు, మున్సిపల్ పరిపాలన శాఖకు సంబంధించి వార్డు అడ్మిన్, ఎన్విరాన్‌మెంట్, శానిటేషన్, సంక్షేమ, విద్యాశాఖకు సంబంధించిన ఉద్యోగులకు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్‌లకు జెడ్‌పి కాంపౌండ్, సర్వేయర్సుకు కలెక్టరేట్, ఎఎన్‌ఎంలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం, పంచాయతీ కార్యదర్శులకు జిల్లా పరిషత్‌లో, సంక్షేమ, విద్యాశాఖకు చెందిన ఉద్యోగులకు పరివర్తన్ భవన్‌లో అధికారులు కౌన్సెలింగ్ చేపట్టారు. మొత్తం 19 శాఖలకు సంబంధించిన వార్డు, గ్రామ సచివాలయాల ఉద్యోగులు మొత్తం 17 వేల మంది ఉండగా వీరిలో 2 వేల మంది వరకు బదిలీ కోరుకున్నట్టు సమాచారం. గ్రామ సచివాలయాల్లో 11 శాఖలు, వార్డు సచివాల యాల్లో 8 శాఖలకు చెందిన అధికారులు బదిలీల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
ఎక్కువ మంది వారు నివశిస్తున్న ప్రదేశానికి దగ్గరగా ఉన్న సచివాలయాల్లోనే మూడేళ్ల క్రితం ఉద్యోగం వచ్చిన దృష్ట్యా ఎక్కువ మంది బదిలీ కోరుకోలేదని చెబుతున్నారు. మహిళా పోలీసుల బదిలీలను జిల్లా ఎస్‌పి ఆరీఫ్ హఫీజ్ పర్యవేక్షించారు. ఉమ్మడి జిల్లా వార్డు మహిళా పోలీసుల బదిలీలు పారదర్శకంగా నిర్వహిస్తున్నట్టు ఎస్‌పి తెలిపారు. బదిలీల్లో సిఫార్సులకు తావులేకుండా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీ విభాగంలో గ్రేడ్-5, గ్రేడ్-6 కార్యదర్శులకు జిల్లా పంచాయతీ అధికారి ఆర్.కేశవరెడ్డి జిల్లా పరిషత్‌లో నిర్వహించారు. విఆర్‌వోలకు కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్‌రావు, సర్వేయర్లకు ఆ శాఖ ఎడి రూప్లా నాయక్, ఎఎన్‌ఎంలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎ.శ్రావణ్‌బాబు, సంక్షేమ విద్యాశాఖలకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టరు మధుసూదనరావు, విద్యాశాఖ అధికారి పి.శైలజ కౌన్సిలింగ్ నిర్వహించారు.










