లండన్ : బ్రిటీష్ అకాడమీ బుక్ ప్రైజ్‌కు భారతీయ సంతతికి చెందిన ఇద్దరు రచయితలు ఎంపికైనట్లు మంగళవారం జ్యూరీ పేర్కొంది. 'ప్రపంచ సాంస్కృతిక అవగాహన' పేరుతో ఇచ్చే ఈ బహుమతి కింద 25,000 జిబిపి (బ్రిటన్ పౌండ్లు) అందించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆరుగురు రచయితలలో వీరిని ఎంపిక చేసినట్లు జ్యూరీ తెలిపింది. బ్రిటన్‌కు చెందిన నందినీదాస్ రచించిన 'కోర్టింగ్ ఇండియా : ఇంగ్లాండ్, మొఘల్ ఇండియా అండ్ ది ఆరిజన్స్ ఆఫ్ ఎంపైర్' అమెరికాకు చెందిన క్రిస్ మంజప్రా రచించిన 'బ్లాక్ ఘోస్ట్ ఆప్ ఎంపైర్ : ది లాంగ్ డెత్ ఆఫ్ స్లేవరీ అండ్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ఎమాన్సిపేషన్' రచనలను ఈ బహుమతి కోసం ఎంపిక చేశారు.
నందినీదాస్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో ఇంగ్లీష్ ఫ్యాకల్టీలో ఎర్లీ మోడరన్ లిటరేచర్ ఆఫ్ కల్చర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీలో చదువుకున్నారు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు.
మంజప్రా మసాచుసెట్స్‌లోని యూనివర్శిటీలో హిస్టరీ అండ్ గ్లోబల్ స్టడీస్ స్టెర్న్స్ ట్రస్టీ ప్రొఫెసర్‌గా ఉన్నారు. అసాధారణ రచనా శైలి మరియు చరిత్రలోని పలు అంశాలపై కొత్త దృక్కోణాలను వెలికితీసిన రచయితల సామర్థ్యం తనని బాగా ఆకట్టుకున్నాయని 2023 జ్యూరీ అధ్యక్షులు, బ్రిటీష్ అకాడమీ సభ్యులు, ప్రొఫెసర్ చార్లెస్ ట్రిప్ పేర్కొన్నారు.