

కరోనాతో యావత్తు ప్రపంచం అల్లకల్లోలమైంది. లాక్‌డౌన్లు, ఆంక్షలతో పౌర జీవనం అస్తవ్యస్తమైంది. ఏడాది గడుస్తున్నా ఈ మహమ్మారిని కట్టడి చేయలేని పరిస్థితి. టీకాల కార్యక్రమం అమెరికా, బ్రిటన్, చైనా వంటి కొన్ని దేశాల్లో మొదలైంది. ప్రపంచ జనాభాలో 14 శాతం మాత్రమే ఉన్న సంపన్న దేశాలు మొత్తం వ్యాక్సిన్ డోసుల్లో సగానికి పైగా డోసులకు ఆర్డర్లిచ్చాయి. దీంతో ప్రపంచ జనాభాలో అయిదో వంతు మందికి అంటే పేద దేశాల్లో ఉన్న వారికి 2022 వరకు ఈ వ్యాక్సిన్ అందే పరిస్థితి లేదని బిఎంజె మెడికల్ జర్నల్ నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. కరోనా మహమ్మారి ఇప్పటికే లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్నది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న అమెరికా, చైనాలు కరోనాపై పోరులో రెండు విభిన్న వైఖరులు తీసుకున్నాయి. కరోనాను జయించి, అభివృద్ధి పథంలో చైనా పురోగమిస్తుంటే.. అగ్రరాజ్యంగా విర్రవీగేే అమెరికా చతికిలపడింది. ఈ వైరస్‌కు కారణం చైనానే అంటూ అదే పనిగా ప్రచారం చేస్తోంది. కానీ, చైనాలో కన్నా ముందే అమెరికాలో కరోనావైరస్ తలెత్తినట్లు ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది. అదలా వుంచితే చైనా కరోనాని ఎలా కట్టడి చేయగలిగింది? ఈ సంక్షోభ పరిస్థితుల్లోనూ ఆర్థికంగా నిలదొక్కుకుని చైనా ఎలా పురోగమించగలుగుతుంది ? అమెరికాలో పరిస్థితి ఎందుకింత అధ్వానంగా తయారైంది ? ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వాలు పూచీ పడాల్సిన అవసరం లేదా ? ఇటువంటి అనేక పాఠాలను ప్రపంచానికి కరోనా నేర్పుతున్నది. వీటన్నింటిపైనే ఈ వారం 'అట్టమీది కథనం'...

పదహారున్నర లక్షల మంది ప్రాణాలను తోడేసి, మరో ఎనిమిది కోట్ల మందిని పట్టి పీడించిన కరోనా మహమ్మారికి డిసెంబరు 8తో ఏడాది పూర్తయింది. చైనాలోని హ్యూబెయి రాష్ట్రంలో మొట్టమొదట బయటపడిన కరోనా మహమ్మారి అనతి కాలంలోనే ప్రపంచాన్ని చుట్టేసింది. మొదట్లో కరోనాకు ఎపీ సెంటరు (కేంద్ర నాభి)గా ఉన్న ఉహాన్‌లో ఆ మహమ్మారిని చైనా సమర్థవంతంగా అదుపు చేసింది. ఇప్పుడు అమెరికా నంబర్ వన్ ఎపీ సెంటరుగా తయారైంది. భారత్, బ్రెజిల్, ఇటలీ, బ్రిటన్, స్పెయిన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఎపీ సెంటర్లుగా మారాయి.
చైనా 'గోల్డెన్ వీక్'కు అపూర్వ స్పందన
చైనాలో నేడు స్కూళ్లు, ఫ్యాక్టరీలు, బ్యాంకులు, మాల్స్, సినిమా హాళ్లు, స్టేడియంలు, పర్యాటక ప్రదేశాలు అన్నీ ఎప్పటిలాగే పనిచేస్తున్నాయి. విమానాలు, రైళ్లు, నౌకాయానాలకు ఎలాంటి ఆటంకాలూ లేవు. విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేందుకు చైనా అవతరణ దినోత్సవం అయిన అక్టోబరు 1 నుంచి 8 వరకు నిర్వహించిన 'గోల్డెన్ వీక్' కు అపూర్వ స్పందన లభించింది. ఆ వారం రోజులూ చైనాలో పర్యాటక ప్రదేశాలు దేశీయ, విదేశీ పర్యాటకులతో కిటకిటలాడాయి. రెస్టారెంట్లు, దుస్తులు, ఆభరణాలు, గృహోపకరణాల తదితర అమ్మకాలు జోరుగా సాగాయి. వారం రోజుల్లో చిల్లర వర్తకం, హోటళ్లు, రెస్టారెంట్లు వ్యాపారం 1.6 లక్షల కోట్ల యువాన్లు (23,600 కోట్ల డాలర్లు) మేర సాగింది. పర్యాటక ఉత్సవాలను పెద్దఎత్తున నిర్వహిస్తోంది. జాతీయ అవతరణ దినోత్సవం సందర్భంగా ఇటీవల నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవాలకు విదేశాల్లో ఉన్న చైనీయులు పెద్దఎత్తున తరలివచ్చారు. మొత్తం 61.8 కోట్ల మంది వివిధ పర్యాటక ప్రదేశాలను ఈ సందర్భంగా సందర్శించినట్లు చైనా పర్యాటక సాంస్కృతిక శాఖ తెలియజేసింది. చైనా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగిందనడానికి ఇదొక తార్కాణం. 2035 నాటికి చైనాను అభివృద్ధి చెందిన ఆధునిక సోషలిస్టు దేశంగా నిలిపేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల భౌతిక జీవన స్థితిగతుల మెరుగుదలకు చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలపై పెట్టుబడులను గణనీయంగా పెంచింది. వైవిధ్యంతో కూడిన వినోదం, సాంస్కృతిక జీవనం మెరుగుదలకు నిరంతరం ప్రయత్నిస్తోంది.
ఉహాన్‌లో సాధారణ పరిస్థితి
గతేడాది ఇదేకాలంలో కోవిడ్ వైరస్ బయటపడిన ఉహాన్‌లో నేడు తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. హ్యుబే రాష్ట్రం ఉహాన్‌లో వైరస్ మొదటిసారి తలెత్తినపుడు చైనా ప్రభుత్వం దీన్ని ఎలా ఎదుర్కోవాలి? అనే విషయంలో తర్జనభర్జన పడింది. చరిత్రలో భయానకమైన వ్యాధులను అరికట్టడంలో అనుసరించిన ప్రాచీన పద్ధతులను మొదట అది చేపట్టింది. చేతులు కడుక్కోవటం, మాస్కులు ధరించటం, భౌతికదూరం పాటించడం, శరీర ఉష్ణోగ్రతను పర్యవేక్షించడం వంటివి ముందు ప్రవేశపెట్టింది. తర్వాత ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రయత్నం చేసింది. కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్న దశలో పెద్ద ఆసుపత్రులను నిర్మించింది. సాధారణంగా అందించే వైద్యసేవలతోపాటు ఆన్‌లైన్ వేదిక ద్వారా, ఇతర పద్ధతుల ద్వారా అతి మారుమూల ప్రాంతాలకు సైతం వైద్యసేవలను విస్తరించింది. 5జి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి అవసరమైన సహాయ సహకారాలను వేగంగా అందేలా చేసింది. వేల కోలోమీటర్ల దూరంలో పనిచేసే సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను క్షణాల్లో తెలుసుకోవడం, అవసరమైన సహాయాన్ని అందించడంలో 5జి సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆధునిక యుగంలో అత్యంత ప్రమాదకారి అయిన వైరస్ గురించి ప్రపంచానికి అంతగా తెలియని పరిస్థితిలో దీన్ని చైనా చాలా సమర్ధవంతంగా ఎదుర్కోగలగడానికి ఈ శాస్త్ర, సాంకేతిక విజ్ఞానమే ఆధారం. పైస్థాయి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకూ సమాజంలో అన్ని తరగతులవారూ ఈ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకుని, ఆపరేట్ చేసేలా తగు తర్ఫీదునిచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి వైద్యులను, నర్సులను పెద్దఎత్తున హ్యమే రాష్ట్రానికి తరలించింది.
చైనా కన్నా ముందే అమెరికాలో కరోనా ? !
గతేడాది డిసెంబరు నాటికే అమెరికాలో కోవిడ్ కేసులు నమోదయ్యాయని సిడిసి పరిశోధకులు జరిపిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. చైనాలో తొలి కేసు నమోదవడానికి చాలా వారాలు ముందుగానే ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ విస్తరిస్తున్నట్లు సాక్ష్యాధారాలు ఉన్నట్లు ఆ అధ్యయనం పేర్కొంది. డిసెంబరు 13 నుండి జనవరి 17 మధ్య కాలంలో తొమ్మిది రాష్ట్రాల్లో అమెరికన్ రెడ్‌క్రాస్ సంస్థ సేకరించిన నమూనాలను అమెరికా సిడిసి (సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) కి పంపారు. అప్పటికే వారిలో యాంటీబాడీస్ తయారైనట్లు పరీక్షల్లో తేలింది. సిడిసి పరిశోధకుల నివేదికలో వెల్లడించిన నిర్ధారణలను పరిశీలిస్తే గతేడాది డిసెంబరులోనే అమెరికాలో సార్స్-కొవిడ్-2 ఇన్ఫెక్షన్లు వుండి ఉండొచ్చని తెలుస్తోంది. 2020 కన్నా ముందుగా చైనాకు వెలుపల కూడా కరోనా వుండి ఉండవచ్చనడానికి ఇదే తొలి ఆధారం కాదు. డిసెంబరులో ఫ్రాన్స్‌లో ఒక రోగి ఫ్లూ వంటి లక్షణాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఇదే నిజమైతే జనవరి చివరిలో ఉహాన్ నుండి తిరిగి వచ్చిన వారి ద్వారా దేశంలోకి కొవిడ్ ప్రవేశించిందని ఇప్పటివరకు జరుగుతున్న ప్రచారం నిరాధారమైనదని తేలుతుంది. డిసెంబరు మధ్యలో అమెరికాలోని పశ్చిమ ప్రాంతంలో ఇటువంటి ఇన్ఫెక్షన్లు ఉన్నాయని సిడిసి అధ్యయనం చెబుతోంది.
అమెరికాలో పరిస్థితి
అమెరికా ప్రభుత్వం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఇది 21వ శతాబ్దంలో మానవాళి పట్ల అనుసరించిన ఊచకోతగా పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ట్రంప్ వ్యక్తిగత పోకడలకు పోయాడు. ప్రజలను దేవుని కృపకు వదిలిపెట్టేశాడు. కరోనా మహమ్మారిపై ప్రపంచం యావత్తూ సమిష్టిగా పోరాడాల్సిన సమయంలో ట్రంప్ ప్రభుత్వం అత్యంత బాధ్యతా రహితంగా వ్యవహరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ)కు సహాయ నిరాకరణ చేయడమే కాకుండా ఆ సంస్థ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో కరోనాతో ప్రతిరోజూ మూడువేల మంది వరకూ చనిపోతున్నారు. కరోనా కేసుల సంఖ్య ఇక వేరే చెప్పనక్కరలేదు. పెరిగిపోతున్న కరోనా రోగులకు ఆసుపత్రుల్లో పడకలు దొరకడం లేదు. చనిపోయినవారిని ఖననం చేసేందుకు శ్మశానాల్లో చోటు చాలడంలేదు. బ్రూకింగ్స్ సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో అమెరికా తల్లుల్లో పదిశాతం మంది తమ ఐదేళ్లలోపు పిల్లలు ఆకలితో మలమలమాడుతున్నారని తెలియజేశారు. ఇది అక్టోబరు, నవంబరులో పరిస్థితి. దాదాపు 12 శాతం మంది వయోజనులు తమకు తినడానికి సరైన తిండీ దొరకడం లేదని వాపోయారు. ఉచిత ఆహార కేంద్రాల వద్ద పెద్దఎత్తున ప్రజలు బారులు తీరి నిలుచోవటం అమెరికాలో సాధారణ దృశ్యంగా మారిపోయింది. ప్రపంచంలో అతి సంపన్నమైన దేశంలో ప్రజల పరిస్థితి ఇదీ !
ట్రంప్ ప్రాధాన్యతలు వేరు. నొప్పి కలగకుండా ఎలాంటి చర్యలూ తీసుకోకుండానే కరోనా సమసిపోవాలనేది ఆయన థియరీ. మరోవైపు చైనా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం ద్వారా సత్వరమే స్పందించడం, కేసులను గుర్తించడం, రోగులను వేరుచేయడం, సరైన చికిత్స అందించడం ద్వారా కోవిడ్‌ను అరికట్టింది. చైనా సమాజం నేడు దేన్నైనా ఎదుర్కొనగలమన్న విశ్వాసంతో ముందుకు సాగుతోంది. అమెరికా కార్పొరేట్ లాభాలు తగ్గకుండా చూడటం కోసం లాక్‌డౌన్‌లు కానీ, ఆంక్షలు కానీ, కనీస జాగ్రత్తలు కానీ తీసుకోకుండా వదిలేసింది. చైనాను చూసి నేర్చుకోవలసిందిపోయి, అక్కడ మానవ హక్కులను హరించి వేస్తోందని, ప్రజలపై తీవ్రమైన ఆంక్షలు విధిస్తోందని అమెరికా ప్రచారం మొదలుపెట్టింది.

పుంజుకుంటున్న చైనా ఆర్థిక వ్యవస్థ
ఆర్థిక సంక్షోభం, ఆపై కోవిడ్ మహమ్మారి.. ప్రతాపం చూపడంతో ప్రపంచంలో అత్యధిక భాగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన తరుణంలో చైనా ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోంది. కరోనా ప్రభావం చైనా ఆర్థిక వ్యవస్థపై ఉన్నప్పటికీ మాంద్యం వంటి పరిస్థితులు ఏమీ తలెత్తలేదు. కొంత స్తబ్ధత మాత్రం నెలకొంది. ప్రస్తుత డిజిటలీకరణకు ముందే చైనా ఆర్థికవృద్ధి మెరుగైన స్థితిలో ఉంది. కోవిడ్ వచ్చాక పరిశోధన, పెట్టుబడులు, డిజిటల్ రంగాల్లో చైనా మరింత కేంద్రీకరించింది. ఇది ఆర్థిక వ్యవస్థ తిరిగి సాధారణ స్థితికి చేరుకోవటానికి ఎంతగానో ఉపయోగపడింది. కోవిడ్ సమయంలోనూ చైనా ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి దిశగా సాగడం ఆ దేశంలో అసుసరిం చిన ఆర్థిక విధానాలే కారణం. భవిష్యత్‌లోనూ సవాళ్లను దీటుగా ఎదుర్కొనే సత్తా తనకుం దని చైనా నిరూపించింది. ఏడాది క్రితం చైనా త్రైమాసిక జిడిపి వృద్ధిరేటు 4.9 శాతం ఉండగా, ఈ ఏడాది అక్టోబరు 2020 అక్టోబరు నాటికి 5.8 శాతానికి చేరుకున్నట్ల్లు చైనా జాతీయ గణాంకాల బ్యూరో విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభానికి, ఇప్పటికీ పోల్చి చూస్తే దిగుమతులు 13.2 శాతం, ఎగుమతులు 9.9 శాతం పెరిగాయి. అంతర్జాతీయ వాణిజ్య సరళిని బట్టి చూస్తూ అభివృద్ధి చెందిన దేశాల వాణిజ్యం ఈ కాలంలో గణనీయం గా పడిపోయింది. చైనా మాత్రం తన స్థానాన్ని నిలుపుకుంది. ఉత్తమ సామర్ధ్యాన్ని ప్రదర్శించిన ఆర్థిక వ్యవస్థల్లో 14వ స్థానాన్ని ఆక్రమించింది. చైనా ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా ఉన్న షెంజాన్ పరిశోధనా రంగంలో కీలకశక్తిగా నిలిచింది. పాలనా వ్యవస్థను ఆధునీకరించడం, విస్తరించడం ద్వారా అది కొత్తతరహా పరిశోధనలకు పట్టుగొమ్మగా ఉంది. అభివృద్ధి, పరిశోధన రంగంలో చైనా తన పాత్రను గణనీయంగా మెరుగుపరుచుకుంది. 2019లో ఈ రంగంలో అది 12.5 శాతం మెరుగుదల సాధించింది. పరిశోధన, అభివృద్ధికి చైనా తన జిడిపిలో 2.23 శాతం (37వేల కోట్ల డాలర్లు) కేటాయించింది. అమెరికా తన జిడిపిలో 2.38 శాతం (47వేల కోట్ల డాలర్లు) కేటాయించగా, ఇజ్రాయిల్ 4.9 శాతం (1200 కోట్ల డాలర్లు), దక్షిణ కొరియా 4.5 శాతం (7,300 కోట్ల డాలర్లు), భారత్ 0.69 శాతం (4,800 కోట్ల డాలర్లు) కేటాయించాయి. వచ్చే పదిహేనేళ్లలో చైనా పరిశోధన, అభివృద్ధి రంగానికి మరిన్ని నిధులు వెచ్చించాలని నిర్ణయించింది.

దేశీయంగా కరోనా వ్యాక్సిన్ల తయారీ
కరోనా వైరస్ పనిచేయకుండా మొద్దుబారేలా చేసే రెండు వ్యాక్సిన్లను చైనా ఇటీవల తయారు చేసింది. సినోఫార్మా, సినోవాక్ కంపెనీలు దేశీయంగా తయారు చేసిన ఈ వ్యాక్సిన్లను అత్యవసర వినియోగానికి ప్రభుత్వం అనుమతించింది. ఈ వ్యాక్సిన్‌ను డోస్ ఒక్కింటికి 200 యువాన్లు (30 డాలర్లు) చొప్పున చెల్లించి, ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా అందజేస్తోంది. అమెరికన్ ఔషధ తయారీ సంస్థ ఫైజర్ ఇటీవల విడుదలజేసిన వ్యాక్సిన్ డోస్ ధర టోకున 20 డాలర్ల దాకా ఉంది. మోడెర్నా సంస్థ వ్యాక్సిన్ ధర టోకున 10 నుంచి 50 డాలర్ల వరకు పలుకుతుంది.

కె.గడ్డెన్న,
9490099012