ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని అధికారులను పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ ఆదేశించారు. ఈ అంశంపై సిఎంతో వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక కలెక్టరేట్ నుండి కలెక్టర్‌తోపాటు జెసి శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్షను 4 విడతలుగా నిర్వహించనున్నట్లు చెప్పారు. తొలి విడతగా ఈ నెల 15 నుండి ప్రజా ప్రతినిధులు, గృహసారధులు, వాలంటీర్లు ప్రతి ఇంటినీ సందర్శించి ఆరోగ్య వివరాలు సేకరించాల్సి ఉంటుందని, వైద్యం పొందానికి ఆరోగ్యశ్రీపైనా అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామానికి రెండు బృందాలు ఉండి ఒక బృందం ఎ.ఎన్.ఎం ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు-2, వాలంటీర్, రెండవ బృందం హెల్త్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు, వాలంటీర్లు కలిసి పర్యటిస్తారని అన్నారు. రక్త, మూత్ర, గళ్ల, బిపి, షుగర్, మలేరియా, డెంగీ తదితర ఏడు రకాల పరీక్షలు నిర్వస్తారన్నారు. మూడవ విడతగా మెడికల్ క్యాంప్ నిర్వహణకు మూడు రోజుల ముందు ప్రజా ప్రతినిధులు, గృహ సారధులు, వాలంటీర్లు మెడికల్ క్యాంప్‌పై అవగాహన కల్పిస్తారన్నారు. నాల్గవ విడతలో వైద్యశిబిరం నిర్వహించి పరీక్షలు చేయడంతోపాటు అవసరమైన వారికి మందులు, కళ్లజోళ్లు అందిస్తారని అన్నారు. దీర్ఘ కాలిక వ్యాదులతో బాధపడేవారిని వారికి అవసరమైన నిరంతర సేవలు అందేలా చూస్తారన్నారు. ఈ కార్యక్రమాలన్నీ 45 రోజుల్లో ముగించాల్సి ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ బి.రవి, డిసిహెచ్‌ఎస్. డాక్టర్ రంగారావు, ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ సునీలా, ఐసిడిఎస్ అధికార అరుణ, పల్నాడు అర్బన్ డవలప్మెంట్ విసి శ్రీనివాసులరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
15వ తేదీకి నవోదయం మార్పు
పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ ఆధ్వర్యంలో ప్రతినెలా 14వ తేదీన నిర్వహించే 'నవోదయం' కార్యక్రమం మినీ జాబ్ డ్రైవ్ మేళాను ఈనెల 15వ తేదికి మార్పు చేసినట్లు నవోదయం కార్యక్రమ నోడల్ అధికారి సంజీవరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగ యువత తమ విద్యార్హత పత్రాలతో కలెక్టర్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.










