Oct 21,2023 00:21
సమీక్షలో మాట్లాడుతున్న జెసి రాజకుమారి

ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో 2023-24 సీజన్‌కు సంబంధించి పత్తి కొనుగోళ్లపై మార్కెటింగ్‌, వ్యవసాయ శాఖ, పోలీసు, అగ్నిమాపక శాఖ, ట్రాన్స్‌పోర్ట్‌ శాఖ అధికారులతో జెసి రాజకుమారి శుక్రవారం సమీక్షించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో జెసి మాట్లాడుతూ జిల్లాలో కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సిసిఐ) ఆధ్వర్యంలో 10 జిన్నింగ్‌ మిల్లులు, 4 మార్కెట్‌ యార్డులను పత్తి కొనుగోలు కేంద్రాలుగా గుర్తించామన్నారు. గుంటూరు మార్కెట్‌ యార్డు పరిధిలో 3, తాడికొండ పరిధిలో 2, ఫిరంగిపురం పరిధిలో 1, ప్రత్తిపాడు పరిధిలో 4 జిన్నింగ్‌ మిల్లులను గుర్తించి ప్రత్తి కొనుగోలు కేంద్రాలుగా గుర్తించారని వివరించారు. పత్తిరైతులంతా తమ పేర్లను తమ దగ్గరలోని ఏదైనా రైతు భరోసా కేంద్రంలో నవంబర్‌ 1 నుండి నమోదు చేయించుకొని, దగ్గరలోని ఏదైనా జిన్నింగ్‌ మిల్లులకు తీసుకువెళ్లి క్విటాళ్‌ కనీస ధర రూ.7020కు విక్రయించుకోవచ్చని చెప్పారు. రైతులెవ్వరూ మధ్యవర్తులు/దళారుల వద్దకు వెళ్ళకుండా తమ నాణ్యమైన పత్తిని గుర్తించిన చేసిన జిన్నింగ్‌ మిల్లులలో కనీస మద్దతు ధరకు అమ్ముకొవచ్చన్నారు. గుర్తించిన జిన్నింగ్‌ మిల్లులు మార్కెట్‌ యార్డుల వద్దకు ఎవరైనా మధ్యవర్తులుగానీ, దళారులుగానీ వస్తే వారిపై చట్ట పరమైన క్రిమినల్‌ కేసులు నమోదు చేయబడతాయి హెచ్చరించారు. సమావేశంలో సహాయ మార్కెటింగ్‌ సంచాలకులు బి.రాజబాబు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎన్‌.వెంకటేశ్వర్లు, సిసిఐ బయ్యర్లు ఉదరు ఆర్‌.షా, పి.నాగేశ్వరరావు, ఎం.ఉమా మహేశ్వరరావు పాల్గొన్నారు.